News

వాడవాడలా ఘనంగా ఛత్రపతి శివాజీ జయంత్యుత్సవాలు

691views

విశాఖపట్నం: మహారాజ్‌ ఛత్రపతి శివాజీ జయంత్యుత్సవాలు ఏపీలో ఘనంగా జరిగాయి. విశాఖపట్నం బీవీకే కాలేజీలో శనివారం విద్యార్థులు స్వయంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా దువ్వూరి సత్యనారాయణ విచ్చేసి, మాట్లాడారు. శివాజీ మహారాజ్‌ జీవిత ఘట్టాలను, శివాజీ పరాక్రమం, దేశం కోసం అతను తలపెట్టిన ముఖ్యకార్యాలను పూసగుచ్చినట్టు వివరించారు.

అంతకుముందు ఇద్దరు విద్యార్థులు జి.వివేక్‌, రిషీతనాయుడు శివాజీ గురించి మాట్లాడారు. గౌతమి అనే విద్యార్థిని వేదికపై ప్రదర్శించిన కర్రసాము ఆకట్టుకుంది. అనంతరం కాలేజీ ప్రిన్సిపాల్‌ జేవీఎస్‌కేవీ కల్యాణి మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల జయంతి, వర్ధంతులు నిర్వహిస్తే కళాశాల తరుఫున నుంచి ఎల్లవేళలా ప్రోత్సాహం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు.

నంద్యాలలో…

నంద్యాల: స్థానిక ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో నంద్యాలలోని వివేకానంద ఆడిటోరియంలో ఛత్రపతి శివాజీ మహారాజ్‌ జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రధాన వక్త ప్రాంత సహా సేవ ప్రముఖ్‌ మనోహర్‌ మాట్లాడుతూ శివాజీ ముస్లిం పరిపాలనను మట్టికరిపించి, హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప ధీరుడన్నారు.

శివాజీ అహ్మద్‌ కోటను జయించిన తరువాత నేతాజీ పాల్కర్‌ మంచి రూపవతి సుల్తాన్‌ కోడలను బంధించి, మెప్పు పొందాలని శివాజీకి కానుక ఇచ్చేందుకు ప్రయత్నిస్తాడని, అయితే, శివాజీ తన సైన్యాన్ని మందలించి, నేతాజి పాల్కర్‌ను దేశ బహిష్కరణ చేసి, ఆ మహిళలో మాతృత్వాన్ని దర్శించి తన సైనికులు చేసిన పనికి క్షమించమని ఆమెను వేడుకుంటాడు.

నేనే నీ కడుపున పుట్టి ఉంటే నేను కూడా నీ అంత అందంగా ఉండే వాడిని అంటూ తనకు తోబుట్టువులా సకల లాంఛనాలతో తిరిగి అహ్మద్‌ కోటకు పంపస్తాడని తెలిపారు. ప్రతి వ్యక్తికి జాతీయ శీలంతో పాటు వ్యక్తిగత శీలం కూడా శివాజీ జీవితం నుంచి నేర్చుకోవాలన్నారు.

మహానందిలో…

మహానందిలో కూడా శివాజీ జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా అయోధ్య కరసేవలో పాల్గొన్న కరసేవకులకు ఘనంగా సత్కరించారు. 13 గ్రామాల మీదుగా కాషాయ జెండాల బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

మహానంది దేవస్థానం పరిధిలోని పోచ బ్రహ్మానంద రెడ్డి హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రధాన వక్త వేణుగోపాల్‌ మాట్లాడుతూ సమాజం మరింత ముందుకు వెళ్ళాలంటే ఆనాడు శివాజీ అనుసరించిన స్ఫూర్తిదాయకమైన పోరాట పటిమను అందరం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి