
తిరుపతి: తిరుమలేశుడి ఆర్జిత సేవల టికెట్ల ధరలు పెంచాలని టీటీడీ నిర్ణయించింది. తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో ఆర్జిత సేవల టికెట్ల ధరలు పెంపుపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం ఉన్న ధరలను నాలుగు నుంచి ఐదు రెట్లు పెంచాలని దేవస్థాన ధర్మకర్తల మండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సూచించారు.
సుప్రభాత సేవను రూ. 8వందల నుంచి రూ. 2 వేలకు.. కళ్యాణోత్సవం, అర్చన, తోమాల సేవలను రూ. ఐదువేలకు పెంచాలని తీర్మానం చేశారు.
సిఫార్సు లేఖలతో ఆర్జిత సేవలు కోరుకునే భక్తులపై అధిక భారం మోపడం తప్పేమీ కాదని ఛైర్మన్ చెప్పడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఆర్జిత సేవల టికెట్ల ధరల పెంపుపై ధర్మకర్తల మండలి నిర్ణయాన్ని భక్తులు తీవ్రంగా తప్పుపడుతున్నారు.
ప్రస్తుతం ఉన్న ధరలను ఒకేసారి ఐదు రెట్లు పెంచడంతో స్వామి వారి దర్శనం సాధారణ భక్తులకు భారంగా మారుతుందంటున్నారు. ధార్మిక సంస్థ టీటీడీ వ్యాపార సంస్థగా మార్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సేవలకు నిధులు కేటాయింపు
కేంద్ర ప్రభుత్వం కొవిడ్ నిబంధనలను సడలించిన నేపథ్యంలో శ్రీవారి ఆర్జిత సేవలను తక్షణమే పునరుద్ధరించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ ధర్మకర్తల మండలి ఛైర్మన్ వైవీసుబ్బారెడ్డి తెలిపారు. ఎప్పటి నుంచి ప్రారంభించాలనేది రెండు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. క్రమంగా సర్వదర్శన, నడక దారి భక్తుల టోకెన్ల సంఖ్యను పెంచనున్నట్టు స్పష్టం చేశారు. టీటీడీ ధర్మకర్తల మండలి చేసిన తీర్మానాలను వెల్లడించారు.





