News

ఆంధ్రా, కేర‌ళ‌లో ఇద్ద‌రు బీజేపీ నేత‌ల హ‌త్య‌!

442views

విజ‌య‌వాడ‌/తిరువ‌నంత‌పురం: భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) నేత‌ల‌పై రోజు రోజుకూ రాజకీయ ప్రత్య‌ర్థుల దాడులు పెరుగుతున్నాయి. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, కేర‌ళ‌లో ఇద్ద‌రు నాయ‌కులను పొట్ట‌న పెట్టుకున్నారు.

కృష్ణా జిల్లా వత్సవాయి మండలం లింగాలలో బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి లంకల మల్లారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. శుక్ర‌వారం అర్ధరాత్రి నుంచి కనిపించకుండా పోయిన మల్లారెడ్డి ఉదయం శవమై కనిపించాడు.
చిట్యాల – లింగాల గ్రామాల మధ్యనున్న మామిడి తోటల్లో మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. కార్యకర్తలతో కలిసి వత్సవాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన మల్లారెడ్డి.. అర్ధరాత్రి ఇంటికి వెళుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు వెంబడించి, దాడి చేసినట్టు నందిగామ డీఎస్పీ నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు.

ఆ తర్వాత మల్లారెడ్డి కనిపించలేదని, స్థానికుల సమాచారంతో ఈ ఉదయం పొలాల్లో మృతదేహాన్ని గుర్తించామని చెప్పారు. మల్లారెడ్డి మెడ, భుజాలపై కత్తి గాయాలు ఉన్నాయని చెప్పారు. హత్యకు గల కారణాలపై విచారణ చేపట్టామని వెల్లడించారు. కాగా, రాజకీయ కారణాలతో మల్లారెడ్డి హత్యకు గురైనట్టు స్థానికులు అనుమానిస్తున్నారు.

కేర‌ళ‌లో హ‌త్య‌, ఆరుగురి అరెస్ట్‌

కేరళలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) పార్టీ యువకుడు శరత్ చంద్రన్‌ను కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మార్క్సిస్ట్) (సిపిఎం) కార్యకర్తలు కత్తితో పొడిచి చంపారు. అలప్పుజా జిల్లాలోని హరిపాడ్‌లో ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. హంతకులు డ్రగ్ డీలర్ల‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

బుధవారం పుతెన్‌కారియిల్‌ దేవి ఆలయ ఉత్సవాల సందర్భంగా శరత్‌, హంతకుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. శరత్, ఆ ప్రాంతంలోని ఇతర యువకులు ఆలయ ప్రాంగణంలో సంగీతం, నృత్యాన్ని అభ్య‌సిస్తుంటారు. గుడి దగ్గర జ‌రుగుతున్న డ్రగ్స్ విక్రయాలను శరత్ వ్యతిరేకించినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి.

స్థానిక డ్రగ్స్‌ మాఫియాలు ఆలయ ప్రాంగణాన్ని ఉపయోగించి అక్రమంగా మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్నారని నిజమైన భక్తుల నుంచి ఫిర్యాదులు ఉన్నాయి. శరత్‌ను ప్రశ్నించేందుకు కొందరు సహచరులు వ‌చ్చి, ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరించి వెళ్ళిపోయారు. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో శరత్ తన స్నేహితులతో కలిసి ఆలయం నుంచి ఇంటికి తిరిగి వెళుతుండ‌గా, ప్ర‌త్య‌ర్థులు క‌త్తుల‌తో పొడిచి చంపారు. కుమారపురం వద్ద ఆయుధాలతో వేచి ఉన్న 15 మంది బృందం వారిపై దాడి చేసింది.

శరత్ పొత్తికడుపులో కత్తితో గాయ‌ప‌ర‌చ‌గా, అతని స్నేహితుడు మనోజ్ చేతిని గాయ‌ప‌రిచారు. స్నేహితులు క్ష‌త‌గాత్రుల‌ను మోటార్‌సైకిళ్లపై హరిపాడ్‌లోని తాలూకా ఆస్పత్రికి, ఆ తర్వాత అలప్పుజాలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూనే శరత్ మృతి చెందాడు. మ‌నోజ్ చికిత్స తీసుకుంటున్నాడు.

హరిపాడ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బిజు వి నాయర్ అనుమానితులను అదుపులోకి తీసుకుని, వారికి డ్రగ్స్ మాఫియా సంబంధాలు ఉన్న‌ట్టు నిర్ధారించారు. కుమారపురం పోతపల్లి హౌస్‌కు చెందిన టామ్‌ పి.థామస్‌, కడూర్‌ హౌస్‌కు చెందిన విష్ణు, నిషా భవన్‌కు చెందిన కిషోర్‌కుమార్‌ (34), కిజకత్తిల్‌ హౌస్‌కు చెందిన శివకుమార్‌, కొచ్చుపుఠాన్‌ పారంబిల్‌ హౌస్‌కు చెందిన సుమేష్‌, పులిమూట్టిల్‌ హౌస్‌కు చెందిన సూరజ్‌లను అరెస్టు చేశారు. ఈ డ్రగ్స్ ముఠా నాయకుడు నందు ప్రకాష్ (23) ప్రధాన నిందితుడి. అయితే అతను పరారీలో ఉన్నాడు. అరెస్టయిన వారిలో కనీసం నలుగురిపై అనేక క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.

Source: EtvBharat/Hindupost

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి