
చరిత్రలో కొన్ని మాటలు కాలాన్ని దాటి తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయి. అలాంటి మాటలలో ఒకటి పరమ పూజనీయ శ్రీ గురూజీ చెప్పిన ఈ ఉపమానం
“కొన్నిసార్లు పంటి కింద నాలుక పడి రక్తం రావచ్చు. అంతమాత్రాన పళ్లను ఊడగొట్టుకోము కదా! ఎందుకంటే పళ్లు మనవే… నాలుక కూడా మనదే.”
మహాత్మా గాంధీజీ హత్య అనంతరం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘంపై నిరాధార ఆరోపణలు వచ్చాయి. సంఘ కార్యాలయాలపై, స్వయంసేవకులపై, సంఘ నాయకత్వంపై దాడులు జరిగాయి. అలాంటి అత్యంత ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా గురూజీ ప్రతీకారాన్ని బోధించలేదు. ద్వేషాన్ని ప్రోత్సహించలేదు. సమాజాన్ని శత్రువులుగా విడగొట్టే భావనను అంగీకరించలేదు.
ఆయన చూపిన మార్గం ఒక్కటే సమాజం ఒక్కటే. దారి తప్పినవారు కూడా మనవారే. వారిని ద్వేషించడం కాదు, సన్మార్గంలో నడిపించడమే ధర్మం. దశాబ్దాలు గడిచినా ఆ విలువ మారలేదు.
ఇటీవలి ఘటనల నేపథ్యంలో మోదీ చేసినట్లు ప్రచారంలో ఉన్న సందేశంలో కూడా ఇదే భావం ప్రతిధ్వనిస్తుంది. అది ప్రచారం కాదు; కొద్దిసేపటి క్రితం విడుదల చేసిన సెల్ఫీ వీడియోలో వారు అన్నారు: తనను, తన కుటుంబాన్ని తీవ్రంగా అవమానించిన వారిపట్ల కూడా కక్షతో కాకుండా క్షమతో స్పందిస్తూ, వారిని శిక్షించడం కంటే సరైన మార్గం చూపాలని పిలుపునిచ్చారు.
ఆ భావం మనకు గురూజీ చెప్పిన ఆ అమర వాక్యాన్నే గుర్తు చేస్తుంది
“కొన్నిసార్లు పంటి కింద నాలుక పడి రక్తం రావచ్చు. అంతమాత్రాన పళ్లను ఊడగొట్టుకోము కదా! ఎందుకంటే పళ్లు మనవే… నాలుక కూడా మనదే.”
ఇది కేవలం ఒక ఉపమానం కాదు; ఇది భారతీయ సంస్కృతి చెప్పిన సమరసతా తత్వం. ఇదే సంఘం ఆచరణలో చూపిన జీవన విధానం.
పరమ పూజనీయ డాక్టర్ కేశవ్ బాలిరామ్ హెడ్డేవార్ సంఘాన్ని స్థాపించినప్పుడు సమాజాన్ని విభజించడం కాదు, సంఘటితం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. గురూజీ ఆ భావజాలాన్ని మరింత విస్తరించి, ప్రతికూల పరిస్థితుల్లో కూడా సంయమనం, క్షమ, సమాజ ఐక్యత అనే విలువలను ఆచరణలో చూపించారు.
నేడు ఒక సాధారణ స్వయంసేవక్‌గా ప్రారంభమైన శ్రీ నరేంద్ర మోదీ కూడా అదే సంఘ సంస్కారంలో ఎదిగిన వ్యక్తిగా, ఆ విలువలనే ప్రతిబింబించే స్పందనను వ్యక్తం చేయడం సంఘ సంస్కారం వ్యక్తులను ఎలా తీర్చిదిద్దుతుందో చూపించే ఉదాహరణగా చాలామంది భావిస్తున్నారు.
సంఘం వ్యక్తులను కాదు, విలువలను నిర్మిస్తుంది. ఆ విలువలు కాలం మారినా మారవు. నాయకులు మారవచ్చు, తరాలు మారవచ్చు; కానీ క్షమ, సంయమనం, సమరసత, సమాజాన్ని కలుపుకొని ముందుకు నడిపే దృక్పథం మాత్రం సంఘ జీవన విధానంలో నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది.
అందుకే గురూజీ పలికిన ఆ మాటలు నేటికీ సజీవంగానే ఉన్నాయి.
“కొన్నిసార్లు పంటి కింద నాలుక పడి రక్తం రావచ్చు. అంతమాత్రాన పళ్లను ఊడగొట్టుకోము కదా! ఎందుకంటే పళ్లు మనవే… నాలుక కూడా మనదే.”
ఇది ఒక ఉపమానం మాత్రమే కాదు, సంఘ సంస్కారం, సమరసతా దృక్పథం, క్షమాగుణం, జాతీయ ఐక్యతకు చిరస్థాయి సందేశం.





