News

`హిజాబ్’ నిరసనలపై కర్ణాటక హోం మంత్రి హెచ్చరిక

600views

కర్ణాటక: కర్ణాటకలోని స్కూళ్లు, కాలేజీల్లో హిజాబ్‌ ధరించడంపై విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై కర్ణాటక హైకోర్టు విచారణ జరుపుతున్నప్పటికీ కొన్ని చోట్ల విద్యార్థులు నిరసనలు తెలుపుతుండటంపై రాష్ట్ర హోం శాఖ మంత్రి అరగ జ్ఞానేంద్ర కన్నెర్ర చేశారు.

నిరసనలు తెలుపుతున్న విద్యార్థులు హైకోర్టు తాత్కాలిక ఆదేశాలను పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హిజాబ్ ధరించడం తమ హక్కు అంటూ కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఒక వర్గానికి చెందిన విద్యార్థినులు నిరసనలు సాగిస్తుండటంపై జ్ఞానేంద్ర మాట్లాడుతూ, ఇంతకాలం తాము ఓపికతో వ్యవహరించామని చెప్పారు.

ఇంకెంతమాత్రం ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థుల సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని వారి మనోభావాలు దెబ్బతినకూడదని తాము ఇంతవరకూ ఓర్పుతో ఉన్నామని పేర్కొన్నారు. బయట వ్యక్తులు రెచ్చగొడుతుండటంతో విద్యార్థులు నిరసనలకు దిగుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాధ్యత గల పౌరులుగా ప్రతి ఒక్కరూ కోర్టు ఉత్తర్వులకు కట్టుబడాలని, రాజ్యాంగాన్ని గౌరవించాలని ఆయన కోరారు. వీటిని ఉల్లంఘిస్తే మరో ఆలోచనా లేకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.