
-
క్వాడ్ పిలుపు
మెల్‌బోర్న్: సీమాంతర ఉగ్రవాద వ్యాప్తికి పరోక్ష మద్దతిస్తున్న కొన్ని దేశాల తీరును తీవ్రంగా క్వాడ్(Quadrilateral Security Dialogue) ఖండించింది. ఉగ్రవాదుల నెట్‌వర్క్‌ను, వాటి అడ్డాలను, మౌలిక సదుపాయాలను, ఆర్థిక మూలాలను పూర్తిగా పెకిలించేందుకు సభ్య దేశాలన్నీ కలిసి పనిచేయాలని ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగిన నాలుగో క్వాడ్ విదేశాంగ మంత్రుల సదస్సు నిర్ణయించింది.
అఫ్గాన్ భూ భాగాన్ని ఇతర దేశాలను బెదిరించేందుకు, వాటిపై దాడులకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడుకోరాదని అభిప్రాయపడింది. శాంతి, సుస్థిరత, ఆర్థిక ప్రగతితో కూడిన స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్ ప్రాంతం ప్రపంచ ప్రగతికి కీలకమని భారత విదేశాంగ మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు.
సభ్య దేశాల విదేశాంగ మంత్రులు ఆంటోనీ బ్లింకెన్ (అమెరికా), మారిస్ పైన్ (ఆస్ట్రేలియా), యొషిమాసా హయాషీ (జపాన్)తో పలు అంశాలపై లోతుగా చర్చించారు. ఇండో పసిఫిక్‌ను బెదిరింపులు, నిర్బంధ ఆర్థిక విధానాల బారినుంచి విముక్తం చేయాలని సదస్సు తీర్మానించింది.
ప్రాంత దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారం తదితరాలపై రాజీ ఉండబోదని పేర్కొన్నారు. ‘‘ఉగ్రవాదం, సైబర్ సెక్యూరిటీ, సముద్ర రక్షణ తదితర అంశాల్లో కలిసి పనిచేసేందుకు ఎంతో అవకాశముంది. ఈ ఉమ్మడి లక్ష్యాల సాధనకు ఇండో పసిఫిక్ దేశాలు చేసే ప్రయత్నాలన్నింటికీ మద్దతుగా నిలవాలన్న క్వాడ్ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించాం’’ అని తర్వాత ఉమ్మడిగా మీడియా సమావేశంలో చెప్పారు.
Source: Nijamtoday





