News

‘హిజాబ్’పై సరైన సమయంలో విచారణ: సుప్రీం కోర్టు

518views

న్యూఢిల్లీ : విద్యా సంస్థల్లో మతపరమైన వస్త్రాలను ధరించరాదని విద్యార్థినీ, విద్యార్థులను కర్ణాటక హైకోర్టు ఆదేశించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు వివ‌ర‌ణ ఇచ్చింది. ఈ పిటిష‌న్ల‌పై స‌రైన సమయంలో విచారణ జరుపుతామని శుక్రవారం తెలిపింది. దేశంలోని ప్రతి పౌరుని ప్రాథమిక హక్కులను కాపాడతామని భరోసా ఇచ్చింది. కర్ణాటకలో, హైకోర్టులో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నట్టు తెలిపింది.

అక్క‌డి హైకోర్టు ఇచ్చిన‌ తాత్కాలిక ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం దీనిని పరిశీలించి, సరైన సమయంలో విచారణ జరుపుతామని చెప్పింది.

పిటిషనర్ తరపు న్యాయవాది సీనియర్ అడ్వకేట్ దేవ్‌దత్ కామత్ మాట్లాడుతూ, రాజ్యాంగంలోని అధికరణ 25 ప్రకారం మతాచారాలను పాటించే ప్రాథమిక హక్కు ఉందని, ఈ హక్కును హైకోర్టు ఆదేశాలు సస్పెండ్ చేస్తున్నాయని వాదించారు. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ, తాను ప్రతి పౌరుని ప్రాథమిక హక్కులను కాపాడతానని చెప్పింది. ఈ పిటిషన్‌పై సరైన సమయంలో విచారణ జరుపుతామని తెలిపింది. దీనిపై అత్యవసర విచారణ జరపాలని కామత్ కోరినపుడు సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ స్పందిస్తూ, పరిశీలిస్తామన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి