News

ప్రధానిపై కేటీఆర్ ట్వీట్ … మండిపడుతున్న బీజేపీ

684views

భాగ్య‌న‌గ‌రం: సమతామూర్తి విగ్రహాన్ని పక్షపాతి ఆవిష్కరించారంటూ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌పై బిజెపి మండిపడుతోంది. దానితో బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధం చోటుచేసుకొంటున్నది.. ఈ అంశంపై సోమవారం కేటీఆర్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మధ్య ‘ట్విటర్‌ వార్‌’ జరిగింది.

కేటీఆర్‌ వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి స్పందిస్తూ, ‘‘15 నిమిషాలపాటు పోలీసులను తొలగిస్తే సత్తా చూపిస్తామన్న ఎంఐఎం నేతల వ్యాఖ్యలు, నిజాం రజాకార్‌ ఆర్మీ హిందువుల ఊచకోత లాంటి అంశాలపై ఒవైసీని, ఎంఐఎంను కేసీఆర్‌, కేటీఆర్‌ సమర్థిస్తున్నట్టు అనిపిస్తోంది. సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ కోసం శ్రమిస్తున్న ప్రధానిని అవమానిస్తున్నారు’’ అంటూ ట్విటర్‌లో ఘాటుగా విమర్శించారు.

సమానత్వాన్ని బోధించిన రామానుజాచార్యుల విగ్రహావిష్కరణను సైతం టీఆర్‌ఎస్‌ రాజకీయాలకు వాడుకోవడం ఆ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమని కేంద్ర మంత్రి మండిప‌డ్డారు. పాతబస్తీలోని అనేక వందల హిందూ దేవాలయాలను ధ్వంసం చేసిన ఎంఐఎం పార్టీకి మద్దతుగా నిలిచిన చరిత్ర టి.ఆర్‌.ఎస్‌దేన‌ని అంటూ మండిపడ్డారు. ‘‘ఎంఐఎంకు మద్దతు పలికిన మీ రాజవంశ పాలన కలుషితమైందన్న విషయాన్ని.. ధర్మాలను ప్రబోధించేవారు గ్రహించాలి’’ అని హితవు చెప్పారు.

ఈ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ.. ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణ పట్ల చూపించిన వివక్షకు ఇదీ నిదర్శనమంటూ.. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, పసుపు బోర్డు, ఫార్మాసిటీ, కేఎంటీపీలకు నిధులు కేటాయించకపోవడం, ఐటీఐఆర్‌.. లాంటి 19 అంశాలను ప్రస్తావించారు. ఈ అంశాలపై స్పష్టత ఇవ్వాలని సవాల్‌ చేశారు.

‘‘ఐటీఐఆర్‌ ఇవ్వకున్నా దిగ్గజ ఐటీ కంపెనీలను తెచ్చుకున్నాం. జాతీయ హోదా ఇవ్వకున్నా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం. కాజీపేటలో రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ ఇవ్వకున్నా.. ప్రైవేటు కోచ్‌ ఫ్యాక్టరీ కట్టుకున్నాం. రాష్ట్రానికి అండగా మేము.. దేశానికి దండగ మీరు’’ అంటూ ట్వీట్‌ చేశారు.

కాగా, కేటీఆర్‌పై బీజేపీ మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు మండిప‌డుతూ ‘‘సమతామూర్తి విగ్రహావిష్కరణ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో భాగ్యనగర్‌కు ఇదే చిరునామాగా మారింది. మీరు మద్దతు పలుకుతున్న వారి చార్మినార్‌ కాదు’’ అని ఎద్దేవా చేశారు.

మరోవంక, తెలంగాణపై కేంద్రం పక్షపాత వైఖరి అనుసరిస్తోందంటూ టీఆర్​ఎస్​ ముఖ్య నేతల నుంచి కార్యకర్తల వరకు వరుసగా ట్వీట్లు పెడుతున్నారు. కేంద్ర బడ్జెట్​లో రాష్ట్రానికి కేటాయింపులేమీ చేయలేదని సీఎం కేసీఆర్​ తీవ్ర విమర్శలు చేసిన రోజు నుంచి టీఆర్​ఎస్​ ఈ విమర్శల దాడిని ముమ్మరం చేసింది. వరుస ప్రెస్​ మీట్లు, మంత్రుల ట్వీట్లన్నీ ఒకే తీరుగా కనిపిస్తుండటంతో.. ప్రగతిభవన్​ నుంచే వీటిని ఆపరేట్​ చేస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది.

సోషల్​ మీడియాలో ఎప్పుడూ కనిపించని కొందరు మంత్రులు ట్వీట్లు పెట్టడాన్ని అందుకు ఉదాహరణగా చెప్పుకుంటున్నారు. విభజన నాటి హామీలను ముందేసుకోవటం టీఆర్​ఎస్​కు అనుకూలించకపోగా రాజకీయంగా పలు అనుమానాలకు తావిస్తున్నది. ‘స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ ఆవిష్కరణ కోసం హైదరాబాద్​కు ప్రధాని వచ్చిన రోజున ‘ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ’ అంటూ సోషల్​ మీడియా వేదికగా టీఆర్​ఎస్​ లీడర్లు వరుసగా పోస్టులు పెట్టారు.

ప్రధాని రాక‌ సందర్భంగా ఆ ఒక్కరోజే సుమారు 20 వేలకు పైగా ట్వీట్లు ‘ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ’ హాష్ ట్యాగ్‌తో ట్విట్టర్‌లో ట్రెండ్ అయినట్టు మంత్రి కేటీఆర్ ఆఫీస్ ప్రకటించింది. టీఆర్​ఎస్​ ప్రభుత్వం తాము ఇచ్చిన హామీల అమలులో ఫెయిలవడం వల్లే ఇప్పుడు కేంద్రంపై బాణాలు ఎక్కుపెట్టి ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నదన్న ఆరోపణలు వస్తున్నాయి.

రాష్ట్రంలో అనేక స్కీమ్​లు ముందుకు కదలడం లేదు. డబుల్​ బెడ్రూం ఇండ్లు, రైతు రుణమాఫీ, దళిత బంధు, దళితులకు మూడెకరాల భూమి, రెండో విడత గొర్రెల పంపిణీ.. ఇట్లా దాదాపు స్కీమ్​లన్నీ అటకెక్కాయి. నాగార్జునసాగర్​, హుజూరాబాద్​ బై ఎన్నికల సమయం​లో తప్ప.. మిగతా సందర్భాల్లో ఈ స్కీమ్​లు అమలు కాకుండా ఆగిపోయాయి.

నిరుద్యోగ భృతి, ఉద్యోగ నియామకాలు, 57 ఏండ్లకు ఆసరా పెన్షన్, పోడు భూములకు పట్టాల పంపిణీ.. వంటి హామీలు మూడేండ్లుగా వాయిదా పడుతూనే ఉన్నాయి. తమ వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మళ్లించడం కోసమే కేసీఆర్, కేటీఆర్ నుండి అధికార పార్టీ నేతలు కేంద్రంపై అసందర్భపు ఆరోపణలు చేస్తున్నట్లు స్పష్టం అవుతున్న‌ద‌ని ప‌రిశీల‌కులు వ్యాఖ్యానిస్తున్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి