
ముంబై: జాతీయ గీతాన్ని అగౌరవపరిచిచారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ముంబైలోని మజ్‌గావ్‌లోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. బీజేపీ ముంబై కార్యదర్శి, న్యాయవాది వివేకానంద్ గుప్తా ఆమెపై జాతీయ గీతాన్ని అగౌరవపరిచినందుకు కేసు నమోదు చేశారు. డిసెంబర్ 1, 2021న దక్షిణ ముంబైలోని వై బి చవాన్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన పబ్లిక్ ఫంక్షన్‌లో మమతా బెనర్జీ అతిథిగా హాజరయ్యారు.
కూర్చునే జాతీయ గీతాన్ని పాడారు మమతా బెనర్జీ.. అంతేకాకుండా సగం సగం పాడడం కూడా వివాదాస్పదమైంది. మమతా బెనర్జీ జాతీయ గీతానికి చేసిన అవమానానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఆమె కూర్చొని జాతీయ గీతాన్ని పాడటం ప్రారంభించి, ఆపై అర్ధాంతరంగా ముగించేశారు. అప్పుడే బీజేపీ ముంబై కార్యదర్శి, అడ్వకేట్ వివేకానంద్ గుప్తా ఫిర్యాదు కాపీని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
మమతా బెనర్జీ “కూర్చున్న స్థితిలో జాతీయ గీతం పాడటం ప్రారంభించి, ఆ తర్వాత లేచి నిలబడ్డారని, నాలుగు లేదా ఐదు లైన్లు పాడిన తర్వాత జాతీయ గీతాన్ని అకస్మాత్తుగా నిలిపివేశారని” ముంబైలోని పోలీస్ కమిషనర్‌కు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టం, 1971లోని సెక్షన్ 3 కింద ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
ఉద్దేశపూర్వకంగానే మమతా బెనర్జీ జాతీయ గీతాన్ని పూర్తిగా అగౌరవపరిచారని ఆయన ఆరోపించారు. హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం ఎవరైనా జాతీయ గీతం చిన్న వెర్షన్ పాడాలనుకుంటే, అతను లేదా ఆమె తప్పనిసరిగా మొదటి రెండు లైన్లు, చివరి రెండు లైన్లను పాడాలి. కానీ మమతా బెనర్జీ చేసినదంతా తప్పేనని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జావేద్ అఖ్తర్ కూడా హాజరయ్యారు.
మేజిస్ట్రేట్ స్వయంగా ల్యాప్‌టాప్‌లో సాక్ష్యానికి సంబంధించిన వీడియోను వీక్షించారు. ఈవెంట్ ప్రభుత్వ కార్యక్రమం లేదా ఏదైనా అధికారిక కార్యక్రమం కాదని, ఆమె సీఎం అయినప్పటికీ, ఆమె తన అధికారిక విధులను నిర్వర్తించడం లేదని తేల్చిచెప్పారు. దీంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సమన్లను జారీ చేయడానికి రికార్డులో ఉన్న సాక్ష్యాలు సరిపోతాయని మేజిస్ట్రేట్ అభిప్రాయపడింది. తర్వాతి హియరింగ్‌ను మార్చి రెండోతేదీకి వాయిదా వేసింది.
Source: NationalistHub





