
-
ప్రాంతీయ శ్రేయస్సుకు పరస్పర సహకారం అవసరమని సూచన..
న్యూఢిల్లీ: సమీకృత, స్థిరమైన పొరుగుదేశంగా ఉండాలనే భారత విజన్‌కు సెంట్రల్ ఆసియా ప్రధాన కేంద్రంగా ఉందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారత్-సెంట్రల్ ఆసియా తొలి సదస్సుకు వర్చువల్‌గా నేతృత్వం వహించి పలు అంశాలపై మాట్లాడారు. ప్రాంతీయ భద్రత, స్థిరత్వం, శ్రేయస్సుకు పరస్పర సహకారం అవసరమని సూచించారు.
భారత్-సెంట్రల్ ఆసియా సదస్సులో మూడు లక్ష్యాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించారు. “ప్రాంతీయ భద్రత, శ్రేయస్సుకు దేశాల మధ్య పరస్పర సహకారం అవసరం. సమీకృత, స్థిరమైన పొరుగుదేశంగా ఉండాలనే భారత విజన్‌కు సెంట్రల్ ఆసియా కేంద్రంగా ఉంది.
రెండోది.. దేశాల మధ్య సహకారానికి సమర్థవంతమైన విధానం ఉండాలి. అది.. భాగస్వామ్య దేశాల మధ్య పరస్పర చర్యల కోసం ఒక వేదిక ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తుంది.
మూడోది.. దేశాల మధ్య సహకారానికి ప్రతిష్ఠాత్మకమైన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయటం. ఇది ప్రాంతీయ అనుసంధానత, సహకారం కోసం సమగ్ర విధానాన్ని అవలంబించడానికి వీలు కల్పిస్తుంది” అని మోడీ పేర్కొన్నారు.
వర్చువల్‌గా జరిగిన ఈ సదస్సుకు కజకిస్థాన్ అధ్యక్షుడు కస్యమ్ జొమార్ట్ టొకయెవ్, ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు శవ్కాత్ మిర్జియోయెవ్, తజకిస్థాన్ అధ్యక్షుడు ఎమొమాలి రహ్మోన్, తుర్కెమిస్థాన్ అధ్యక్షుడు గుర్బాంగులి బెర్డిముహామెడోవ్, కిర్గిస్థాన్ రిపబ్లిక్ అధ్యక్షుడు సడైర్ జపరోవ్ హాజరయ్యారు.





