News

సేవాభారతికి ఉత్తమ సేవా పురస్కారం

723views

పదలో ఉన్న ప్రజలకు ఉత్తమ సేవలు అందించినందుకు గానూ నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని సేవాభారతికి ఈ ఏడాది ఉత్తమ సేవా పురస్కారం లభించింది. రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా సేవాభారతి ప్రతినిధులకు ఆ పురస్కారాన్ని ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు అందజేశారు.

పురస్కార పత్రం

నెల్లూరు జిల్లా గూడూరు లోని సేవాభారతి కార్యకర్తలు కరోనా ఫస్ట్ వేవ్ నుంచి ప్రజలకు అనేక విధాలుగా బాసటగా నిలిచారు. ఫస్ట్ వేవ్ లాక్ డౌన్ సమయంలో పేదలకు విస్తృతంగా ఆహార పొట్లాలు, మందుల కిట్లు, నిత్యావసరాల కిట్లు నెలల తరబడి అందజేశారు. లాక్ డౌన్ కారణంగా ఇంటిలో నుంచి బయటకు వచ్చి నిత్యావసరాలు, మందులు వంటివి కొనుగోలు చేసుకోలేక ఇబ్బందులు పడుతున్న ఎందరికో వారు కేవలం ఒక్క ఫోన్ కాల్ తో స్పందించి వారికి అవసరమైనవన్నీ ఇంటికి చేర్చే వ్యవస్థను ఏర్పాటు చేశారు. హైవే వెంట పెద్ద ఎత్తున నడిచిపోతూ ఉండిన వలస కూలీలకు విస్తృతంగా ఆహార పొట్లాలు, మంచినీరు, సోపులు, పేస్టులు, దుస్తుల వంటివి అందజేశారు.

ఫస్ట్ వేవ్ లో సేవలు

 

కోవిడ్ సెకండ్ వేవ్ లో శవదహనాలు

ఇక కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలోనైతే పై అన్నిటితో పాటుగా కోవిడ్ కారణంగా మృతి చెందిన వ్యక్తుల యొక్క మృతదేహాల (సొంత వారు కూడా దగ్గరకు రాని పరిస్థితులలో) దహన సంస్కారాలను కూడా స్వయంగా సేవా భారతి కార్యకర్తలే నిర్వహించడం విశేషం. అలాగే గూడూరు నగరంలోని పాత బస్టాండ్ సెంటర్, పొట్టి శ్రీరాములు పార్క్, గాంధీనగర్, మాళవ్య నగర్, జానకిరాంపేటలలో 2 నెలలపాటు ఉచితంగా కషాయ వితరణ చేశారు. వరదల కారణంగా హైవే రోడ్డు దెబ్బతిని రాకపోకలు బాగా కష్టమై హైవేపై నిలిచిపోయిన వందలాది వాహనాలలోని ప్రయాణికులకు, డ్రైవర్లకు, కండక్టర్లకు పెద్ద ఎత్తున ఆహార పొట్లాలు, మంచినీరు, పసిపిల్లలకు పాలు వంటివి ఏర్పాటు చేశారు.

వర్షాలలో హైవేపై నిలిచిపోయిన వాహానాలలోని వారికి ఆహారం అందజేస్తున్న సేవాభారతి కార్యకర్తలు

ఈ సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందించిన ఉత్తమ సేవా పురస్కారాన్ని MLA శ్రీ వెలగపూడి వరప్రసాదరావు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ మరియు స్వచ్ఛాంధ్రప్రదేశ్ కమిటీ చైర్మన్ శ్రీమతి పొణకా దేవసేనమ్మ, RDO మురళీకృష్ణ, DSP రాజగోపాల్ రెడ్డి, మునిసిపల్ కమీషనర్ శ్రీకాంత్ ల చేతుల మీదుగా సేవాభారతి ప్రతినిధులు శ్రీ శేగు ప్రసాదరావు, శ్రీ విఘ్నేశ్, శ్రీ మల్లిఖార్జునలు అందుకున్నారు. కరోనా ఫస్ట్ వేవ్ లో అందించిన సేవలకుగాను గత సంవత్సరం కూడా ఇదే విధంగా సేవాభారతికి ఉత్తమ సేవా పురస్కారం లభించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.