News

భారత్ బాలుడిని తిరిగి అప్పగించిన చైనా

165views

న్యూఢిల్లీ: చైనా చెరలోని 17 ఏళ్ల భారత బాలుడు మిరామ్ తరోన్‌ను ఇవాళ చైనా ఆర్మీ మన సేనలకు అప్పగించింది. అతడికి భారత ఆర్మీ అధికారులు మెడికల్ టెస్టులు చేయడం సహా మిగిలిన ప్రాసెస్‌ను పూర్తి చేయనున్నారు. ఈ విషయాలను ధ్రువీకరిస్తూ కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు ట్వీట్ చేశారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో వాచా, దమై మధ్య ఉన్న ఇంటరాక్షన్ పాయింట్ వద్ద అతడిని అప్పగించినట్టు తెలిపారు. ఈ కేసులో చాలా జాగ్రత్తగా వ్యవహరించి, ఆ బాలుడిని సేఫ్‌గా స్వదేశానికి తీసుకొచ్చినందుకు ఆయన ఇండియన్ ఆర్మీకి ధన్యవాదాలు చెప్పారు.

నిన్న రిపబ్లిక్‌ డే సందర్భంగా భారత్, చైనా ఆర్మీ అధికారులు హాట్‌లైన్‌ ద్వారా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ఆ బాలుడిని భారత సైన్యానికి ఎక్కడ అప్పగించనుందన్న దానిపై చైనా క్లారిటీ ఇచ్చింది. ఆ తర్వాత ఏ సమయంలో అప్పగిస్తారన్నది మరోసారి వెల్లడించడంతో ఆ మేరకు మన ఆర్మీ ఏర్పాట్లు చేసిందని కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు తెలిపారు. ఆ బాలుడు ఇప్పటి వరకు పొరుగు దేశం ఆర్మీతో ఉన్న నేపథ్యంలో అతడిని డ్రాగన్ సేనలు ఏమైనా ఇబ్బంది పెట్టాయా? ఏవైనా సెన్సర్లు అమర్చడం లాంటివి చేశారా? ఆరోగ్యపరంగా ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా? లాంటి అన్ని విషయాలపై నిశితంగా ఆర్మీ పరీక్షించనుందని తెలుస్తోంది.

కాగా, జనవరి 18న అరుణాచల్ ప్రదేశ్‌లోని అప్పర్ సియాంగ్ జిల్లా పదిహేడేళ్ల మిరామ్ తరోన్ అనే బాలుడు అదృశ్యమయ్యాడు. అతడిని చైనా సైనికులు కిడ్నాప్ చేశారంటూ అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ ఎంపీ తాపిర్ గావ్ గత వారంలో ట్వీట్ చేశారు. సాంగ్ పో నది అరుణాచల్ ప్రదేశ్ లోకి ప్రవేశించే చోట అతడిని కిడ్నాప్ చేసినట్టు ఆయన పేర్కొన్నారు.

Source: Brabhata Velugu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి