News

UP : కాంగ్రెస్ ను వీడిన కీలక నేత – కమల దళంలో చేరిక

564views

త్తరప్రదేశ్ (Uttar Pradesh) అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections 2022) సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌ (Congress) పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆర్‌పీఎన్‌ సింగ్‌ (RPN Singh) కాంగ్రెస్ ‌ను వీడారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి రాజీనామా లేఖ పంపారు. ఈ లేఖను తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసిన ఆర్‌పీఎన్‌ సింగ్‌.. ”నా రాజకీయ ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నా” అని రాసుకొచ్చారు.

దీంతో ఆయన భాజపాలో చేరనున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ ట్వీట్ ‌కు కొద్ది గంటల ముందే ఆయన తన ట్విటర్‌ బయోను మార్చారు. ”ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటీ ఇన్‌ఛార్జ్‌” అనే వాక్యాన్ని తొలగించి “My motto India, First, Always,” అని మార్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారనున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. వాటిని నిజం చేస్తూ కాంగ్రెస్‌ ప్రాథమిక సభ్యత్వానికి ఆర్‌పీఎన్‌ సింగ్‌ రాజీనామా చేయడం గమనార్హం.

కాంగ్రెస్ ‌పై తీవ్ర ప్రభావం

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ.. కాంగ్రెస్ ‌కు ఇది గట్టి ఎదురుదెబ్బే అని చెప్పాలి. రాష్ట్రంలో ఆ పార్టీకి కీలక నేతల్లో ఆర్‌పీఎన్‌ సింగ్‌ కూడా ఒకరు. ఖుషీనగర్‌లోని సైంత్వార్‌ రాజకుటుంబానికి చెందిన ఆర్‌పీఎన్‌ సింగ్‌.. కాంగ్రెస్‌ పార్టీకి అత్యంత నమ్మకస్థుడు. గాంధీ కుటుంబానికి సన్నిహితంగా ఉండేవారు. యూపీలోని పద్రౌనా రాజా సాహెబ్ ‌గా ఈయన పేరు చాలా పాపులర్‌. 1996-2009 మధ్య ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 2009లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. ఏఐసీసీ సెక్రటరీగానూ బాధ్యతలు నిర్వహించారు.
ఆర్‌పీఎన్‌ సింగ్‌ తండ్రి, దివంగత సీపీఎన్‌ సింగ్‌ కూడా కాంగ్రెస్‌ పార్టీలో పనిచేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో కేంద్రమంత్రిగా ఉన్నారు.

అయితే గత కొన్ని రోజులుగా ఆర్‌పీఎన్‌ సింగ్ ‌ను పార్టీ పక్కనబెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అటు గాంధీ కుటుంబంతోనూ దూరం పెరిగింది. దీంతో అసంతృప్తికి గురైన ఆర్‌పీఎన్‌ సింగ్‌.. పార్టీకి రాజీనామా చేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా.. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రచార జాబితాలో ఆర్‌పీఎన్‌ సింగ్‌ పేరు కూడా ఉంది. కాంగ్రెస్‌ ఈ జాబితాను విడుదల చేసిన మరుసటి రోజే సింగ్‌ పార్టీకి గుడ్‌బై చెప్పడం గమనార్హం.

ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను వీడిన రెండో కీలక నేత ఈయనే. గతేడాది సీనియర్‌ నేత జితిన్‌ ప్రసాద హస్తం పార్టీని వీడి భాజపాలో చేరిన విషయం తెలిసిందే. ఆ తర్వాత యోగి ఆదిత్యనాథ్‌ కేబినెట్‌లో ప్రసాదకు చోటు దక్కింది.

కమల దళంలో చేరిక..

అందరూ ఊహించినట్టుగానే ఆర్‌పీఎన్‌ సింగ్‌ భాజపాలో చేరారు. ఈ మధ్యాహ్నమే ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన ఆయనను..మరోసారి పద్రౌనా నియోజకవర్గం నుంచి బరిలోకి దించాలని భాజపా యోచిస్తున్నట్లు సమాచారం. ఇదే స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ.. యూపీ మాజీ మంత్రి స్వామి ప్రసాద్‌ మౌర్యను నిలబెడుతోంది. మౌర్య ఇటీవలే భాజపా నుంచి ఎస్పీలో చేరిన విషయం తెలిసిందే.

ఈనాడు సౌజన్యంతో…

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.