![](https://vskandhra.org/wp-content/uploads/2022/01/PARAKRAMA-DIWAS.jpeg)
* నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని ఇతర ప్రముఖులు
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా దేశానికి నేతాజీ చేసిన సేవలు చిరస్మరణీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. నేతాజీ జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహించుకుంటున్న ‘పరాక్రమ్ దివస్’ సందర్భంగా దేశ ప్రజలందరికీ ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ట్వీట్ చేశారు.
పార్లమెంట్ సెంట్రల్ హాలులోని నేతాజీ చిత్రపటానికి ప్రధాని పుష్పాంజలి ఘటించారు. లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సహా పలువురు మంత్రులు సెంట్రల్ హాలులో నేతాజీకి నివాళులర్పించారు.
ఆయన త్యాగం స్ఫూర్తిదాయకం – రాష్ట్రపతి
రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతాజీకి నివాళి అర్పించారు. నేతాజీ ఆదర్శాలు, ఆయన చేసిన త్యాగం దేశ ప్రజల్లో ఎల్లప్పుడూ స్ఫూర్తిని నింపుతుందని చెప్పారు. “నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా భారత్ నివాళులు అర్పిస్తోంది. స్వేచ్ఛాయుత భారతదేశం అనే భావనను సాకారం చేసేందుకు ఆయన నిబద్ధతతో వేసిన అడుగుల వల్ల దేశానికి స్ఫూర్తిగా మారారు” అంటూ రాష్ట్రపతి కోవింద్ ట్వీట్ చేశారు.