News

బలూచిస్థాన్‌పై పాక్ కొత్త ప్లాన్..

5views

భారత సైన్యం జరిపిన ‘ఆపరేషన్ సిందూర్’ దెబ్బకు పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ కోలుకోలేని విధంగా దెబ్బతింది. మురిద్కేలో ఉన్న ప్రధాన శిక్షణా కేంద్రాన్ని భారత సైన్యం పూర్తిగా ధ్వంసం చేసింది. దీంతో తీవ్ర నష్టాల్లో ఉన్న ఈ ఉగ్ర సంస్థను మళ్లీ బలోపేతం చేసేందుకు ఈసారి పాకిస్థాన్‌ సైన్యంతో పాటు అక్కడి రాజకీయ నాయకులూ రంగంలోకి దిగారు.

రహస్య సమావేశాలు
ఇటీవల లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ముఖ్య అనుచరుడు రాణా సనావుల్లాతో ఫైసలాబాద్‌లో భేటీ అయ్యాడు. దీనిపై భారత నిఘా సంస్థలు దృష్టి పెట్టాయి. పాక్ సైన్యం, ఐఎస్ఐపై లష్కరే ఉగ్రవాదులకు నమ్మకం సడలడంతోనే.. పాక్ ప్రభుత్వం నేరుగా రాజకీయ నేతలను రంగంలోకి దించి ఈ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

హఫీజ్ సయీద్ వృద్ధాప్యం
లష్కరే తోయిబాకు కొత్త నాయకుడిని అధికారికంగా ప్రకటించాలని పాక్ రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం 75 ఏళ్ల హఫీజ్ సయీద్ వయసు పైబడటం, సంస్థలో తీవ్ర అసంతృప్తి నెలకొనడంతో నాయకత్వ సంక్షోభం ఏర్పడింది. అందుకే 50 ఏళ్ల తల్హా సయీద్‌ను అధికారికంగా ఆపరేషన్స్ చీఫ్‌గా మార్చాలని చూస్తున్నారు. కొత్త టెక్నాలజీలపై పట్టున్న తల్హా అయితేనే ఉగ్రవాదులను నడిపించగలడని పాక్ భావిస్తోంది.

బలూచిస్థాన్ సమస్యకు లష్కరే పరిష్కారమా?
పాకిస్తాన్‌కు బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తూంక్వా ప్రాంతాల్లో భద్రత కల్పించడం పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) దాడులతో పాక్ సైన్యం తీవ్రంగా నష్టపోతోంది. బీఎల్ఏ గ్రూపులు పాక్ ప్రభుత్వం లేదా సైన్యంతో చర్చలకు అస్సలు అంగీకరించవు. అందుకే లష్కరే తోయిబా నేతలను రాయబారానికి పంపి బీఎల్ఏతో ఒప్పందం కుదుర్చుకోవాలని చూస్తోంది.

చైనా, అమెరికా ఒత్తిళ్లే కారణం
బలూచిస్థాన్ మీదుగా వెళ్లే ‘చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్’ ఫేజ్-2 ప్రాజెక్ట్‌కు భద్రత కల్పించడం పాక్‌కు కీలకం. అలాగే బలూచిస్థాన్‌లోని మైనింగ్ ప్రాజెక్ట్ కోసం అమెరికా 1.3 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. స్థానిక వనరులను దోచుకుంటున్నారంటూ బలూచ్ ప్రజలు ఈ ప్రాజెక్టులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమ పెట్టుబడుల భద్రతపై చైనా, అమెరికా నుంచి ఒత్తిడి రావడంతోనే పాక్ ప్రభుత్వం లష్కరే తోయిబాను ఆశ్రయించింది.