
జమ్ము: భారత సైన్యం తీవ్రవాదులను అంతం చేసి, జమ్మూ కశ్మీర్‌లో శాంతి స్థాపన కోసం నడుం బిగించింది. ఇందులో భాగంగానే మరొక కరుడుకట్టిన ఉగ్రవాదిని ఖతం చేసి, కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. శ్రీనగర్ శివారులో సోమవారం భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరేతోయిబాకు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది సలీం పర్రే హతమయ్యాడు.
ఈ ఎన్‌కౌంటర్‌లో సలీం పర్రే మృతి చెందినట్టు కశ్మీర్ జోన్ ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. “లష్కరే కమాండర్ సలీమ్ పర్రేను చంపడం పోలీసులకు పెద్ద విజయం. 2016లో 12 మంది పౌరులను హత్య చేయడంలో సలీమ్ పర్రే ప్రమేయం ఉందని” తెలిపారు. శ్రీనగర్ పోలీసులు సలీమ్ పర్రేను లొంగిపోమని కోరినా కూడా పట్టించుకోలేదు. అంతేకాదు.. పోలీసులపై ఎదురుకాల్పులు జరిపాడు. దీంతో భద్రతా బలగాలు స్పందించాల్సి వచ్చింది అని విజయ్ కుమార్ చెప్పారు.
గాసు గ్రామంలో మరో ఉగ్రవాది హతం
ఇదిలావుండగా, గాసు గ్రామంలో భద్రతాబలగాలతో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో గుర్తు తెలియని ఒక ఉగ్రవాది హతమయ్యాడని పోలీసులు తెలిపారు. జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దుల్లో పాక్ భూభాగం నుంచి దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఒక వ్యక్తిని సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్) కాల్చి చంపింది. సాంబా జిల్లా పరిధిలోని రామఘర్ సమీపంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సోమవారం అనుమానాస్పద కదలికలు కనిపించడంతో బీఎస్‌ఎఫ్ జవాన్లు అప్రమత్తమయ్యారు.
పాకిస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తి సరిహద్దులు దాటి లోపలికి ప్రవేశించేందుకు యత్నించగా జవాన్లు పలుమార్లు హెచ్చరించారు. చెప్పినా వినకుండా ముందుకు వచ్చేందుకు యత్నించిన అతడిని బలగాలు కాల్చి చంపాయని సీనియర్ సైనికాధికారి ఒకరు వెల్లడించారు.
Source: NationalistHub
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





