
-
గుర్తించిన జాతీయ దర్యాప్తు సంస్థ
న్యూఢిల్లీ: కీలక రక్షణ స్థావరాల సమాచారాన్ని శత్రుదేశ నిఘా అధికారులకు చేరవేస్తున్నారన్న అభియోగాలపై తాజాగా నమోదైన కేసులో బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ) ఉగ్రవాద సంస్థ పేరు తెరపైకి వచ్చింది. భారత్‌లోని తూర్పు, పశ్చిమ తీరాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, నెల్లూరు జిల్లాల్లోని రక్షణ స్థావరాల సమాచారం చేరవేతలో ఈ సంస్థ పాత్ర ఉన్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) గుర్తించింది.
ప్రత్యేక ఖలిస్థాన్ సాధనే లక్ష్యంగా ఏర్పడిన ఈ ఉగ్ర సంస్థను పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ పెంచి పోషిస్తోంది. బీకేఐని అడ్డం పెట్టుకుని భారత్‌లో అలజడులు సృష్టించేందుకు కొన్నాళ్లుగా ఐఎస్‌ఐ ప్రయత్నిస్తోంది. బీకేఐ నాయకుడైన వాద్వాసింగ్ బబ్బర్ ప్రస్తుతం పాకిస్థాన్‌లో తలదాచుకున్నాడు. కెనడా, జర్మనీ, యూకేతో పాటు భారత్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి ఈ సంస్థ ఉగ్రవాదులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.





