News

కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ‌!

473views
  • ఎన్నికల ముందు ఉత్త‌రాఖండ్ మాజీ సీఎం అస్త్ర సన్యాసం!

డెహ్రాడూన్: మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలలో వరుసగా కాంగ్రెస్ ఎదురు దెబ్బలు తింటున్నది. ఇప్పటికే పంజాబ్, గోవాలో సీనియర్ నేతలు పార్టీకి దూరంగా, తాజాగా ఉత్త‌రాఖండ్‌లో మాజీ ముఖ్యమంత్రి, ఎన్నికల ఇంచార్జ్ హరీష్ రావత్ దాదాపు `రాజకీయ సన్యాసం’ ప్రకటించారు. పైగా, ఈ సందర్భంగా పార్టీ నాయకత్వంపై ధిక్కార ధోరణి వ్యక్తం చేస్తూ వరుస ట్వీట్లు చేశారు.

హ‌రీశ్ రావ‌త్ బుధ‌వారం ఒక్క‌సారిగా పార్టీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎవ‌రైతే త‌న‌ను ఈద‌మంటున్నారో… వారే త‌న కాళ్లు, చేతులు క‌ట్టిపారేశార‌ని అధిష్ఠానంపై తీవ్రంగా విరుచుకుప‌డ్డారు. త‌న విషయంలో పార్టీ తీవ్ర వివ‌క్ష‌త‌ను చూపుతోంద‌ని మండిప‌డ్డారు.

రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకుంటానని చెబుతూ.. ఎన్నికల మహా సముద్రంలో తాను చాలా ఆటు పోట్లను ఎదుర్కొని ఈదానని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి సరైన సహకారం అందకపోవడం వల్ల తాను ఇక విశ్రాంతికి మొగ్గు చూపినట్టు తెలిపారు.

‘ఎన్నికల సముద్రంలో సంస్థాగత స్థాయిలో సహకార హస్తం అందించడానికి బదులు, సహాయ నిరాకరణ జరుగుతోంది. ఇలాంటి సమయంలో సముద్రాన్ని ఈదాల్సి రావడం కష్టమే. అధికారం ఇక్కడ మొసళ్లను వదిలేసింది. అయినప్పటికీ ఈత కొట్టాలని చూసినా ప్రయోజనం లేదు’ అంటూ ఎన్నికల పోరాటం వృధా ప్రయాస అన్నట్టు పేర్కొన్నారు.

‘కాళ్లు కట్టేసి వారి ఆదేశాల మేరకే ఈదాలని నిర్ణయిస్తున్నారు. హరీష్ రావత్ ఇలాంటివి చాలా ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నారు. నా మదిలో ఇప్పుడు ఎన్నికల ఆలోచనలు లేవు. నూతన సంవత్సరమూ సరైన మార్గం చూపుతుంది. ఆ దిశానిర్దేశం కేదార్‌నాథుడే చూపిస్తాడనే నమ్మకం నాకుంది’ అని రావత్ వరుస ట్వీట్లు చేశారు.

కొద్ది రోజుల క్రితం వరకు పంజాబ్ కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జిగా ఉన్న రావత్ ముఖ్యమంత్రి పదవి నుంచి కెప్టెన్ అమరీందర్‌ను తప్పించడంలో కీలకంగా వ్యవహరించారు. అంతే కాకుండా గాంధీ కుటుంబానికి ఆయన ఎంతో విధేయుడన్న ప్రచారం కూడా వినిపిస్తోంది.

కాగా, ఎవ‌రి క‌ర్మ వారు అనుభ‌వించాల్సిందే. ఎవ‌రి క‌ర్మకు వారే బాధ్యులు. ఆల్ ది బెస్ట్ వాఖ్యలపై ఘాటుగా స్పందిస్తూ పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమ‌రీంద‌ర్ సింగ్‌ ట్వీట్ చేశారు. అయితే చాలా చోట్ల నూతన నాయకత్వాన్ని ప్రోత్సహిస్తోన్న కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే సీనియర్ నేతలను పక్కన పెడుతోందనే విమర్శలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే రావత్ ఈ వ్యాఖ్యలు చేశారన్న వాదనలూ వినిపిస్తున్నాయి.

ఇలా ఉండగా, తన వ్యాఖ్యలపై ఆయనను ప్రశ్నించగా సస్పెన్స్‌ను కొనసాగిస్తూ ‘చెప్తాను కానీ, ఇప్పటికైతే ఎంజాయ్ చేయండి’ అంటూ వ్యాఖ్యానించారు. అసలేం జరిగిందని, ఈ వ్యాఖ్యల వెనుక కారణం ఏంటని ఆయనను మీడియా గురువారం ప్రశ్నించింది. దీనికి రావత్ సమాధానం ఇస్తూ ‘టైం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. ప్రతీది మీతో పంచుకుంటాను. మీతో కాకుంటే ఇంకెవరితో పంచుకుంటాను? కానీ ఇప్పటికైతే ఎంజాయ్ చేయండి’ అంటూ పేర్కొన్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి