
తిరువనంతపురం: సీపీఎం పాలనలో ఉన్న కేరళలో మరోసారి హత్యా రాజకీయాలు భగ్గుమని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం తెల్లవారుజామున అలప్పుజా జిల్లాలో బీజేపీ రాష్ట్ర నాయకుడిని నరికి చంపగా, అదే జిల్లాలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా రాజకీయ విభాగం అయిన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర స్థాయి నాయకుడు ఒకరు కొన్ని గంటల ముందు హత్యకు గురయ్యాడు.
బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి, న్యాయవాది రంజిత్ శ్రీనివాస్‌పై అలప్పుజా నగరంలో తెల్లవారుజామున ఆయన ఇంటిపై దాడి జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఉదయం పూట నడకకు సిద్ధమవుతుండగా ఓ ముఠా ఇంట్లోకి చొరబడి పలుమార్లు నరికి చంపింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రంజిత్ పోటీ చేశారు.
ఎస్‌డీపీఐ రాష్ట్ర కార్యదర్శి కెఎస్‌షాన్‌పై కూడా శనివారం రాత్రి ఓ ముఠా దాడి చేసింది. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కారు ఢీకొట్టింది. దుండగులు వాహనం దిగి షాన్‌ను పలుమార్లు నరికి చంపారు. అతన్ని వెంటనే అలప్పుజాలోని స్థానిక ఆసుపత్రికి, తరువాత కొచ్చి ఆసుపత్రికి తరలించగా, అర్ధరాత్రి మరణించాడు. ఈ హత్యలకు సంబంధం ఉందా? ప్రతీకార స్వభావం ఉందా?అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు అలప్పుజా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జి జైదేవ్ తెలిపారు.
బీజేపీ నేత హత్యను ఖండిస్తూ, రంజీత్‌ను పట్టపగలు ‘పీఎఫ్‌ఐ ఉగ్రవాదులు’ నరికి చంపారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్ మండిపడ్డారు. గత రెండు నెలల్లో పిఎఫ్‌ఐ ముగ్గురు బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ నాయకులను హత్య చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం హంతకులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని సురేంద్రన్ విమర్శించారు.
Source: Nijamtoday





