ArticlesNews

ముళ్ళ బాటలో నడచిన జాతీయ కవి గరిమెళ్ళ

1.1kviews

యన మన తెలుగువాడు. కవి, సత్యాగ్రహి. ఆయన కలం నుంచి వెలువడిన పాట స్వాతంత్ర్య గీతంగా మారింది. లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది. భారతదేశంలో బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం కోసం పోరాడిన సామాజిక, రాజకీయ చరిత్ర మనందరికీ తెలుసు. కానీ మన దృష్టిని అంతగా ఆకర్షించనిది ఆ కాలపు సాహిత్య చరిత్ర. నాటి కవులు, రచయితలు తమ తోటి భారతీయులను స్వాతంత్ర్యోద్యమం వైపుకు నడిపించారు. విదేశీ పాలన యొక్క బానిస సంకెళ్ల నుండి భౌతికంగానే కాక, మానసిక సంకెళ్లను కూడా త్రెంచడంలో ఆనాటి కవులు రచయితలెందరో ముందు వరుసలో నిలిచారు. 200 సంవత్సరాల అణచివేత ప్రజలలోని ఆత్మా స్థైర్యాన్ని, సంకల్ప శక్తిని నాశనం చేసింది. కానీ కవిత్వం, పాట పరదేశీ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తమ గొంతును విప్పడానికి దోహదపడింది. ఆనాటి కవుల, రచయితల కవిత్వము, పాట ప్రజలలో తిరుగుబాటును రగిలించటంలో కీలక పాత్ర పోషించాయి.

నాటి స్వాతంత్ర్యోద్యమ కవుల్లో గరిమెళ్ళ సత్యనారాయణది విశిష్టమైన స్థానం. స్వాతంత్ర్యోద్యమ కాలంలో శ్రీ గరిమెళ్ళ గేయాలు జాతీయ వీరరసంతో తొణికిసలాడుతూ పాఠక జనాన్ని ఉర్రూతలూగించాయి. ఆయన వ్రాసిన “మాకొద్దీ తెల్ల దొరతనము …. ” పాట సత్యాగ్రహులకు గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించింది. అలాగే “దండాలు దండాలు భారతమాత” అనే గీతం కూడా ప్రజలను ఎంతగానో జాగృతం చేసి ప్రజలు పెద్దఎత్తున స్వాతంత్ర్యోద్యమంలోకి ఉరికే తెగువను కలుగజేసింది. దేశభక్తి కవితలు వ్రాసి జైలుశిక్ష అనుభవించిన వారిలో ప్రథముడు శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ. నిజాయితీకి, నిర్భీతికి మారుపేరుగా నిలిచారు. మాకొద్దీ తెల్ల దొరతనం పాట ఆనాడు ప్రతి తెలుగువాడి నోటా మార్మ్రోగేది. ఆయనంత ప్రసిద్ధినొందిన జాతీయకవి ఆ రోజుల్లో మరొకరులేరు. తెలుగునాట జాతీయ కవిత్వానికి నూతన ఒరవడిని సృష్టించిన కవి ప్రముఖుడు శ్రీ గరిమెళ్ళ.

గరిమెళ్ళ సత్యనారాయణ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడు గ్రామంలో 1893 జూలై 14న జన్మించారు. తల్లి సూరమ్మ, తండ్రి వేంకట నరసింహం. గరిమెళ్ళ ప్రాథమిక విద్య స్వగ్రామమైన ప్రియాగ్రహారంలో సాగింది. విజయనగరం, మచిలీపట్నం, రాజమహేంద్రవరం మొదలయిన చోట్ల పైచదువులు చదివారు. బి.ఏ. చేశాక గంజాం కలెక్టర్ కార్యాలయంలో గుమస్తాగా కొంతకాలం పనిచేశారు. ఆ తరువాత విజయనగరం ఉన్నత పాఠశాలలో ఉపాథ్యాయుడిగా కొంతకాలం పనిచేశారు. గరిమెళ్ళ చిన్నప్పుడే తన మేనమామ కూతుర్ని వివాహం చేసుకున్నారు. ఆయన స్వేచ్ఛాప్రియత్వం వల్ల ఎక్కడా ఎక్కువకాలం ఏ ఉద్యోగమూ చెయ్యలేకపోయారు.

జాతీయోద్యమ స్ఫూర్తి

1920 డిసెంబర్‍లో కలకత్తాలో జరిగిన కాంగ్రెసు మహాసభలో సహాయనిరాకరణ తీర్మానం అమోదించబడింది. ఆ వీరావేశంతో ఉద్యమంలోకి దూకిన గరిమెళ్ళ ‘ మా కొద్దీ తెల్లదొరతనం పాటను వ్రాశారు. ఆనాటి రోజుల్లో రాజమండ్రిలో ఈ పాట నకలు కాపీలు ఒక్కొక్కటి బేడా ( 12 పైసలు) చొప్పున అమ్ముడు పోయేవట. ఆ రోజుల్లో కాంగ్రెసు స్వచ్ఛంద సేవకులు ఖద్దరు దుస్తులు ధరించి, గాంధీటోపి పెట్టుకుని, బారులు తీరి మువ్వన్నెల జెండా ఎగరవేసుకుంటూ.

మాకొద్దీ తెల్లదొరతనము- దేవ
మాకొద్దీ తెల్లదొరతనము…..

అంటూ ఆకాశం దద్దరిల్లేలా పాడుతూ వీధుల్లో కవాతు చేసేవారట.

ఆ తర్వాత సబర్మతీ ఆశ్రమంలో, గాంధీజీ ఈ పాటకు అనువాదము చేయించమని పురమాయించారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారి “స్వరాజ్య” పత్రికలో ఇంగ్లీష్ లోకి అనువదించి ప్రచురించారు.N.G..రంగా, గరిమెళ్ళను “ప్రజా పాటల త్యాగయ్య” అని ప్రశంసించారు.

ఆనోటా – ఈనోటా ఈ పాట గురించి ఆనాటి బ్రిటీషు కలెక్టరు బ్రేకన్ చెవినపడి ఆయన గరిమెళ్ళను పిలిపించి పాటను పూర్తిగా పాడమన్నారట. గరిమెళ్ళ కేవలం రచయితే కాదు, గొప్ప గాయకుడు కూడా. తన కంచు కంఠంతో ఖంగున పాటలు కూడా పాడగలడు. గరెమెళ్ళ పాట విన్న బ్రిటీషు కలెక్టరు తెలుగుభాష నాకు రాకపోయినప్పటికీ, ఈ పాటలో ఎంతట మహత్తర శక్తి ఉందో, సామాన్య ప్రజల్ని సైతం ఎలా చైతన్యపరచగలదో నేను ఊహించగలనన్నాడట. ఆ పాటను వ్రాసినందుకు గరిమెళ్ళకు ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించారు.

ఈ అరెస్టు 9 ఫిబ్రవరి 1922 న జరిగింది. ఫిబ్రవరి 11 ఎడిషన్‌లో, ది హిందూ వార్తాపత్రిక గరిమెళ్ళ తన దేశ ప్రజలను ఉద్దేశించి వ్రాసిన ఒక లేఖను ప్రచురించింది:

“ప్రియమైన సోదర సోదరీమణులారా! నేను నా చిన్న పనిని పూర్తి చేశాను. ఇప్పుడిక విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తున్నాను. బ్రిటిష్ పాలకులు నా కలాన్ని, గళాన్ని ఒక సంవత్సరం పాటు రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు. నేను సమాజ శాంతికి, బ్రిటిష్ వారి ఉనికికి ప్రమాదకరమట. నేను నిజంగా అలాంటివాడినే అయితే, వారు నన్ను చాలా ఆలస్యంగా గుర్తించినట్లు లెక్క. నేను అందించగలిగిన, అత్యుత్తమమైన రచనలు నేను దేశానికి ఇచ్చాను. నా భౌతిక శరీరం బందీ కానుంది. కానీ నా ఆత్మ నా సాహిత్యం ద్వారా ప్రజల మధ్యనే స్వేచ్చగా ఉంటుంది. . దానిని సేకరించి, ఏకీకృతం చేసి, పని చేయనివ్వండి. అది నా బలహీనమైన శరీరం కంటే ఎక్కువగా పనిచేస్తుంది. నేను ఇప్పుడు చాలా నిర్మల హృదయంతో ఉన్నాను. ఆ భగవంతుని కృపతో నేను స్వరాజ్య గీతాలను, మీ విజయ గీతాలనూ ఆలపించటానికి మళ్ళీ మీ మధ్యలోకి వస్తాను.

ప్రేమాప్యాయతలతో….
ఇట్లు
మీ గరిమెళ్ల సత్యనారాయణ.

శిక్షపూర్తి చేసుకుని జైలు నుంచి విడుదలయిన గరిమెళ్ళ మళ్ళీ ప్రజల మధ్య గొంతెత్తి పాడసాగాడు. ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకోసాగాడు. ఇది చూసి ప్రభుత్వాధికారులు భయపడ్డారు. గరిమెళ్ళ బయట వుండటం ప్రభుత్వానికి మంచిది కాదని భావించి ఆయనను అరెస్టు చేశారు. కాకినాడ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచారు. మేజిస్ట్రేట్ రెండు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించాడు.

గరిమెళ్ళ జైలులో వుండగా 1923 జనవరిలో ఆయన తండ్రి చనిపోయాడు. క్షమాపణ చెబితే వదులుతామని చెప్పారట. కానీ గరిమెళ్ళ క్షమాపణ చెప్పకుండా జైలులోనే ఉన్నారు. అంతటి దేశభక్తుడు ఆయన.
1921 నాటికి, మహాత్మా గాంధీ స్వాతంత్ర్యోద్యమంలో తిరుగులేని నాయకుడిగా మారారు. ఆయన స్ఫూర్తితో, అన్ని వయసుల, తరగతుల ప్రజలు ‘సత్యాగ్రహులు’ అయ్యారు. బ్రిటిష్ వారు వారిని దేశద్రోహులుగా చిత్రీకరించారు. నిర్దాక్షిణ్యంగా వేధించారు. ఈ పరిస్థితిని గరిమెళ్ళ ‘మాకొద్దీ…..’ పాటలో వివరించారు.

స్వాతంత్ర్య సమరయోధులను అరెస్ట్ చేయడంలో ప్రభుత్వం చాలా తీవ్రంగా ఉంది కాబట్టి, గరిమెళ్ల ప్రజలు స్వచ్ఛందంగా కోర్టులో అరెస్ట్ కావాలని కోరారు. బయట బానిసలుగా జీవించడం కంటే జైళ్లను నింపి, స్వేచ్ఛగా ఉండాలని ప్రజలకు ఆయన సూచించారు. తాను బోధించిన వాటిని జీవితాంతం ఆచరించి చూపిన వ్యక్తి ఆయన.

కొంతమంది భారతీయ నాయకులు పాశ్చాత్య జీవన విధానాన్ని, ఆలోచనా విధానాలను కలిగి ఉండడం ఆయనకు నచ్చేది కాదు. ఆయన వ్రాసిన అనేక వ్యాసాలు, పాటలలో ఆ అనుభూతి వ్యక్తమయింది. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ విధంగా రాజీ పడడం వల్ల ఎదురయ్యే ప్రమాదాల గురించి ఆయన నాయకులను అనేక విధాల హెచ్చరించారు.

‘హార్మెట్ ఆఫ్ ఇండియా’ పేరుతో ఆయన ఆంగ్లంలో రచించిన తన మొదటి ఆంగ్ల రచనలో అది స్పష్టంగా కనిపిస్తుంది. అందులో, ఆయన బ్రిటిష్ వారి పట్ల విధేయత ప్రదర్శించే వారిని శిక్షించాలని ఉద్బోధించారు.

నిఖార్సైన, సూక్ష్మ బుద్ధి కలిగిన జాతీయవాది

ఆంగ్లేయులు గోమాతల్ని సంహరించడంపై ఆయన ఎలుగెత్తారు. అలాగే హిందూ ధర్మంపై కొనసాగిస్తున్న సైద్ధాంతిక దాడిని కూడా ఆయన సూక్ష్మంగా గ్రహించగలిగారు. ఆ రోజుల్లో చాలామంది స్వాతంత్ర్య సమరయోధుల్లో, ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలలో, పెద్ద పెద్ద నాయకులలో సైతం ఈ స్పృహ, దృష్టి ఉండేవి కావు. కానీ గరిమెళ్ళ వారు దానిని పసిగట్టగలిగారు. తన “మాకొద్దీ తెల్లదొరతనము….” గేయంలో దానిని వెల్లడించారు.

“చూడియావులకడుపు వేడి వేడి మాంసం వాడీకి బహు ఇష్టమంట
మాపాడీ మొదవుల కోస్తడంట | మతము పాడూ చేసివేస్తడంట ।”

గరిమెళ్ళ వారి సూక్ష్మ దృష్టికి ఈ గేయంలోనే ఇంకొక తార్కాణముంది. ఆంగ్లేయులు హిందూ ధర్మాన్ని, సమాజాన్ని బలహీనపరచే తమ ప్రయత్నంలో భాగంగా హిందువులలో విభజన తీసుకొచ్చే ప్రయత్నాలు తమ వ్రాతల ద్వారా మొదలుపెట్టారు. చరిత్రను అన్ని విధాలా వక్రీకరించి హిందూ సమాజంలోని అంటరానితనం వంటి అన్ని రకాల వికృతులకూ బ్రాహ్మణులే కారణమని ప్రచారం మొదలుపెట్టారు. హిందూత్వం బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైనదనే భావనను కలిగించే ప్రయత్నం చేశారు. తమిళనాడులో ఆ కారణం చేతనే ద్రవిడవాదం మొదలైంది. కొన్నిచోట్ల, ముఖ్యంగా దక్షిణభారతంలో కొన్నిచోట్ల బ్రాహ్మణేతరులు బ్రాహ్మణులను తీవ్రంగా ద్వేషించటం మొదలైంది. ఆంగ్లేయుల ఆ కుట్రను ఆయన ఆనాడే పసిగట్టి తన గేయం ద్వారా ప్రజలను మేల్కొలిపే ప్రయత్నం చేశారు. అదే సమయంలో కులభేదాలు పాటించేవారికి కూడా హితబోధ చేశారు.

బ్రాహ్మణాబ్రాహ్మణ పంచమాబ్రాహ్మణ భేదాల తెగులుమీకేలా
మీ వడిగొల్చ రేల I
చెడ్డబోధనలకు లొంగిరేల
ఈ మాధూకరపువృత్తి మరగినారది యేల

ఎంతో లోతైన దృష్టి ఉంటే తప్ప ఆంగ్లేయుల ఆ కుట్రను గ్రహించటం సాధ్యం కాదనే చెప్పాలి. అంతేకాదు… ఎవరెన్ని విధాలుగా మభ్యపెట్టజూచినా వితండ వాదం మాని మనమంతా సోదరుమని, మన మధ్య ఎలాంటి భేదభావమూ లేదని చాటుదాము రమ్మంటూ ఈ క్రింది చరణంలో ఆయన పిలుపునిచ్చారు.

ఎవరెన్ని చెప్నా హిందూదేశ వాసులేక సోదరూలమండి
అంటూ దోషాము మాకు లేదండీ
అంటూ చాటుదాము రండీ
మీకుంటి వాదనాలు గూటిలో పెట్టండి.

ఎన్ని కష్టాలెదురైనా మొక్కవోని స్వదేశీ, స్వధర్మ దీక్ష

గరిమెళ్ళవారు జైలులో ఉండగా గాంధీతత్వం బాగా వంటపట్టింది. విదేశీ విద్య, విదేశీ వస్తు బహిష్కరణ పిలుపును మనసారా నమ్మారు గరిమెళ్ళ. తన ముగ్గురు తమ్ముళ్ళను ఇంగ్లీషు చదువులు మాన్పించారు.

తన చెల్లెల్ని ఇంగ్లీషు చదువు చదివిన వాడికిచ్చి పెళ్ళి చేయనని భీష్మించారు. ఆయన దేశభక్తి కుటుంబానికి శాపమైంది. ఉద్యోగాలు లేక కుటుంబం పేదరికంలోకి నెట్టబడింది. ఒక తమ్ముడు దేశాలుపట్టి వెళ్ళి పోయాడు. ఆస్తులు అమ్ముకుని పొట్టపోసుకోవటంతో అవీ హరించాయి. మధ్యమధ్యలో పోలీసుల కేసులు, జైలుశిక్షలు. దేశాన్ని ఏమి ఉద్దరిస్తాడోగాని కుటుంబాన్ని నాశనంచేశాడన్న సూటిపోటి మాటలు. అయినా తాను ఎంచుకున్న మార్గంనుండి ఒక్క అంగుళం కూడా పక్కకు జరగలేదు.

తాను వ్రాసిన పుస్తకాలు, ఇతరుల పుస్తకాలు ప్రచురిస్తే బాగుంటుందని శారద గ్రంథమాల అనేది ప్రారంభించారు. దేశభక్తి తప్పించి మరో యుక్తి తెలియని గరిమెళ్ళకు భారీ ఆర్థిక నష్టమే మిగిలింది. ఆయన ఎక్కువగా రాజమండ్రి, విజయవాడ, మద్రాసులకు తిరుగుతూ వుండడంతో, వాటిని పట్టించుకోక పోవడం వల్ల వాటిని చెదలు తినేశాయి.
ఎదురుగా కనిపించిన ప్పుడు తన కవిత్వాన్ని, తన పోరాట మార్గాన్ని ప్రశంసించిన వారే తన వెనకాల ఎటువంటి మాటలంటున్నారో ఆయనకు బాగా తెలిసింది.

రచనలు

1921లో శ్రీ గరిమెళ్ళవారి ‘ స్వరాజ్య గీతములు ‘ పుస్తకం వెలువడింది. 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యములు, భక్తిగీతాలు, బాలగీతాలు మొదలైన రచనలు వెలువడ్డాయి. గరిమెళ్ళ చాలాసార్లు జైలు శిక్ష అనుభవించారు. జైలులో వుండగా తమిళ, కన్నడ భాషలు కూడా నేర్చుకున్నారు. తమిళ, కన్నడ గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. ఆంగ్లంలో కూడా గరిమెళ్ళ కొన్ని రచనలు చేశారు.

ప్రసిద్ధ తమిళ రచన తిరుక్కురళ్ ‌ను తెనిగించారు. ‘హర్ట్‌ ఆఫ్‌ ది నేషన్‌, మదర్‌ ఇండియా’ మొదలైన ఇంగ్లీషు పద్యకావ్యాలను రచించారు. నాలడియార్‌ వంటి ప్రసిద్ధ తమిళ పద్యాలను తెనిగించారు. తళ్ళికోట అనే కన్నడ నాటకాన్ని తెలుగులోకి అనువదించారు. ఆయన వ్రాసిన హరిజనోద్యమ గీతాలు, స్వర్జాయపు గీతాలు తెలుగునాట ప్రతిధ్వనించాయి.

“కూలిపోతున్నది కూలిపోతున్నది -మూల మట్టముతోటి కూలిపోతున్నది ప్రభుత్వం – కూకటివేళ్ళతో కూలిపోతున్నది పర ప్రభుత్వం” అనే గేయాన్ని, “దండాలండోయ్‌ బాబు మేముండలేమండోయ్‌ బాబు సైతాను ప్రభుత్వాన్ని సాగనీయమండోయ్‌ బాబు” అంటూ సాగే 113 చరణాల దీర్ఘగేయాన్ని ఆయన రచించారు.

భారతదేశంలో వలస పాలకుల తీరును పరిశీలించడానికి బ్రిటన్ నుంచి వేల్స్‌ యువరాజు వచ్చినప్పుడు గరిమెళ్ళ ‘ఏమయ్యా యువరాజా ఎందుకొచ్చావు?’, అంటూ దొరల దోపిడీ పాలనను తీవ్రంగా నిరసించే గేయాన్ని వ్రాశారు. స్వేచ్ఛాస్వాతంత్య్రాలను శాశ్వతంగా హరించే పత్రికా ప్రభుత్వ ధిక్కారణ బిల్లులను, ప్రశ్నించే హక్కులను లేకుండా చేయాలని ప్రయత్నించిన పాలకుల తీరుపై పోరు సాగించిన యోధుడుగా గరిమెళ్ళ చరిత్రలో మిగిలిపోయారు.

ఆంగ్లం నుంచి కొన్ని గ్రంథాలను తెలుగులోకి అనువదించారు శ్రీ గరిమెళ్ళ. భోగరాజు పట్టాభిసీతారామయ్య ఆంగ్లంలో వ్రాసిన ‘ ది ఎకనామిక్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా’ అనే గ్రంథాన్ని తెలుగులోకి అనువదించారు. 1937లో ’చీనా-జపాన్’ అనే పుస్తకాన్ని రచించారు. గరిమెళ్ళ జీవనోపాధి కోసం 1933లో మద్రాసు చేరుకున్నారు. అక్కడ ’గృహలక్ష్మి’ పత్రిక సంపాదకులుగా ఉద్యోగంలో చేరారు. కొంతకాలం తరువాత అక్కడ మానివేసి ఆచార్య రంగా గారి ’వాహిని’ పత్రికలో సహాయ సంపాదకులుగా చేరారు. కొద్ది రోజులతర్వాత ఆంధ్రప్రభలో చేరారు. కొంతకాలం ఆనందవాణికి సంపాదకుడుగా పనిచేశారు. కొంతకాలం ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా జీవనం సాగించారు.

అభ్యుదయ రాజ్యాంగ విధానం, జవహర్లు మతం, పూర్వపు బానిసత్వం నేటి ధన బానిసత్వం, ధర్మమేవ జయతే, మాణిక్యం విచికము విరుగుడు, పాత కాంగ్రెస్‌ వర్కర్లు లోక సేవకులు కావాలి, తెల్లవాడు తొలగందె పండగేమిటి మనకి? కాంగ్రెస్ ‌కు పట్టిన పిచ్చి ఆవేశం’ మొదలైన వ్యాసాలు ఢంకా, ఆనందవాణి పత్రికల్లో వ్రాశారు.

ప్రముఖ రాజకీయ, సామాజిక వారపత్రిక ‘జాగృతి’ ప్రారంభమైన తొలినాళ్లలో గరిమెళ్ల సత్యనారాయణ గారి వ్యాసాలకు అది వేదికగా ఉండేది.

అసలుసిసలు గాంధేయ వాదులకు దక్కని గుర్తింపు

జీవితంలో ఎదురైన అనేక ఎదురు దెబ్బలతో ఒకరకంగా చెడి చెన్నపట్నం చేరారు గరిమెళ్ళ సత్య నారాయణ. 1933లో చెన్నపట్నం చేరిన తర్వాత ఆయన దాదాపు అజ్ఞాత జీవితమే గడిపారు.

తానెవరో గతంలో తెలిసినవారికి తప్పించి మరెవరికీ తాను ఫలానా అని చెప్పుకునే ప్రయత్నం చెయ్య లేదు. తనవల్ల దెబ్బతిన్న సోదరుడికి సహాయం చేసేందుకు చెన్నపట్నంలో వేల్పవేం అనే భోజన హోటల్ని ప్రారంభించారు. అదికూడా కలిసిరాకపోవడంతో భారీగా అప్పులు మాత్రమే మిగిలాయి.

చివరికి ఆ హోటల్ కి భవనం అద్దెకిచ్చినవారు తమ అద్దె బకాయిల కోసం గరిమెళ్ళను బయటకునెట్టి అక్కడి బల్లలు, తబేళాలన్నీ వేలం వేశారు.

ఆ హోటల్ ముందు దీనంగా కళ్ళనీళ్ళు పెట్టుకుని బక్కచిక్కిన శరీరంతో మౌనంగా రోదించారు. అంతేకానీ నోరుతెరిచి తాను గరిమెళ్ళ సత్యనారాయణ అని ఒక్కసారి కూడా చెప్పుకోలేదు. ఆ మాట చెప్పినా లేక తాను వ్రాసిన “మాకొద్దీ తెల్లదొరతనం” అనేపాటను ఎత్తుకుని ఉన్నా చెన్నపట్నంలోని తెలుగువారు అప్పటికప్పుడు ఆయన్ని ఆదుకునే యత్నంచేసేవారేమో?

కానీ తాను దేశంకోసం పోరాటం చేశానేకానీ దాని వలన వచ్చిన పేరు ప్రఖ్యాతులను సొమ్ము చేసుకునేందుకు కాదనుకున్నారు. ఆర్థిక కష్టాలలో కొట్టుమిట్టాడుతున్న సమయంలోనే రెండవ భార్య కూడా మరణించింది..

దహన కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా డబ్బులులేని దారిద్ర్యం. చివరికి ఇరుగుపొరుగులు ఆదుకుని ఆమెను సాగనంపాల్సి వచ్చింది.

గరిమెళ్ళ సత్యనారాయణది నష్టజాతకం అనుకోవాలో, స్వాతంత్ర్య పోరాటవీరులను మరచిపోయిన భారతీయులను నిందించాలో తెలీదు. 1947లో దేశానికి స్వాతంత్య్రం లభించింది. గాంధీతత్వాన్ని పరిమితంగా వంటబట్టించుకున్న వారంతా పెద్ద పెద్ద పదవులు చేపట్టారు. కానీ గాంధీజీ మార్గమే జీవితం అనుకున్న గరిమెళ్ళలాంటి వారంతా ఆకలిబాధతో అలమటించటం మొదలెట్టారు. వారి త్యాగాలకు విలువలేదు. గరిమెళ్ళ గీతాల అవసరం ఎవరికీ లేకుండా పోయింది.

చివరి రోజుల్లో…..

గరిమెళ్ళ తన చివరి రోజుల్లో దుర్భర దారిద్ర్యాన్ననుభవించారు. చుట్టూ తన గురించి తెలిసిన వారే. కానీ వారి మధ్యలో ఉన్నది తానేనని ఎవరికీ తెలియనివ్వని జీవితం. పట్టెడన్నం పెట్టేవారు లేక, ఆకలిబాధ తట్టుకోలేక చివరిరోజుల్లో చెన్నపట్నం వీధుల్లో బిచ్చమెత్తుకుంటూ తిరిగారు.

ఆయన చేతిలో పైసా విదల్చక విసుక్కున్న వారు ఆయన వ్రాసిన పాటలనే పాడుకుంటూ పోవటం, ఆ గేయ రచయిత గురించి ఘనంగా చెప్పుకోవటం విన్న గరిమెళ్ళ మనసు ఎటువంటి ఆవేదనకు గురైందో ఎవరికీ తెలియదు. తెలుసుకునే ప్రయత్నం కూడా ఎవ్వరూ చెయ్యలేదు.

ఎందుకిలా? అని ఒక పరిచయస్తుడడిగితే “కొందరు త్యాగం చెయ్యాలి. కొందరు నశించి, నాశనమై పోవాలి. అప్పుడే దేశం బాగుపడుతుంది. దేశం బాగుకోరిన నేను ఇంతే” అన్నదే గరిమెళ్ళ సమాధానం.

శ్రీ గరిమెళ్ళ పేదరికం అనుభవిస్తున్న రోజుల్లో దేశోధ్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు కొంత సహాయపడ్డారు. వావిళ్ళ వేంకటేశ్వర శాస్త్రులు ప్రతినెలా ఆయనకు కొంత ఆర్థిక సహాయం చేసేవారు. వివిధ పత్రికలకు, ఆలిండియా రేడియోకి రచనలు చేసి కొంత గడిస్తున్నా ఆయన అవసరాలకు ఆ డబ్బు చాలలేదు. ఒకవైపు పేదరికం, మరోవైపు అనారోగ్యం ఆయనను బాగా దెబ్బతీశాయి. చివరిదశలో ఒక కన్నుపోయింది. పక్షవాతం వచ్చింది.

స్వాతంత్ర్యానంతరం మన పాలకుల వల్ల కూడా గరిమెళ్ళకు చెప్పుకోదగ్గ సహాయం లభించలేదు. దాంతో కొంతమంది మిత్రులు గరిమెళ్ళను ‘ మాకొద్దీ నల్ల దొరతనం ‘ అనే గేయం వ్రాయలని అడిగారట. దేశ భక్తుడు, స్వాతంత్ర్య పిపాసి అయిన గరిమెళ్ళ అందుకు అంగీకరించలేదుట.

ఆకలితో అలమటిస్తూ, దుర్భర పేదరికంలో డిశంబర్ 18, 1952న చెన్నపట్నంలో ఎవరికీ తెలియని వ్యక్తిగా గరిమెళ్ళ సత్యనారాయణ మరణించారు.

అంతకు రెండురోజుల ముందే పొట్టి శ్రీరాముల బలిదానంతో ఆంధ్రప్రాంతమంతా ఆందోళనలో ఉంది. అలాంటి సమయంలో ఆ ప్రజాకవిని ఒక అనామక శవంగా కొందరు ఇచ్చిన చందాలతో అంత్యక్రియలకు చేర్చారు. ఒక మహాకవి జీవితం అలా ముగిసిందన్న వాస్తవం తెలుగువారిలో చాలామందికి తెలీదు.

కీర్తిశేషుడు….

ఏదైతేనేం తన కలంతో తెలుగు నేలలో కలకలం రేపిన
తెలుగు జాతిని ఉర్రూతలూగించిన ఒక కవి దిగ్గజం
తన అవసాన దశలో…..
అక్షరామృతాన్ని ఒలికించిన ఆ చేతులతోనే…
అందరినీ అణా, పైసా అర్ధించారు
ఆలంబన కోసం ఆర్తిగా ఎదురు చూశారు
ఆదరించేవారులేక అల్లాడిపోయారు
కానీ ఆయన ….
అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ చిరంజీవిగా నిలచేవుంటారు….
చరితలో చిరకాలం నిలిచేవుంటారు….
ఎందుకంటే…..
ఆయన అక్షరాలు అక్షయమై నిలిచే ఉన్నాయ్….
అజరామరమై నిలిచే ఉంటాయ్….
ఆయన కీర్తిశేషుడు…. కీర్తి మాత్రమే మిగిలినవాడు….

– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి.

గరిమెళ్ళ సత్యనారాయణ వర్ధంతి నేడు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.