
పాలకులు, ప్రభుత్వోద్యోగులపై అవినీతి ఆరోపణలను పౌరులు ఇక ఆన్‌లైన్‌లోనూ దాఖలు చేయవచ్చు. ఇంతవరకు తపాలా, ఈ-మెయిల్, వ్యక్తిగతంగా మాత్రమే లోక్‌పాల్ కు ఫిర్యాదు చేసే వీలు ఉండేది. ఇక నుంచి వారు లోక్‌పాల్ ఆన్‌లైన్ అనే డిజిటల్ వేదిక ద్వారా కూడా అవినీతి ఆరోపణలను దాఖలు చేయవచ్చు. భారతదేశ ప్రథమ లోక్‌పాల్ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ సోమవారం ఈ వేదికను ప్రారంభించారు. ఇకపై పౌరులు ఎక్కడి నుంచైనా, ఏ సమయంలోనైనా లోక్‌పాల్ ఆన్‌లైన్.గవ్.ఇన్ (LOKPAL.GOV.IN) లో తమ ఆరోపణలు నమోదు చేయవచ్చని జస్టిస్ ఘోష్ తెలిపారు.
ఫిర్యాదుదారుని పేరు, వివరాలను గోప్యంగా ఉంచుతారని… ఈ ఆన్‌లైన్ పోర్టల్ గురించి పౌరులకు, గ్రామీణులకు అవగాహన కల్పించడానికి కృషి చేస్తామని లోకాయుక్త న్యాయ సభ్యురాలు జస్టిస్ అభిలాషా కుమారి చెప్పారు. లోక్‌పాల్ పోర్టల్ కు ఫిర్యాదు పంపిన దగ్గర నుంచి అది పరిష్కారమయ్యే వరకు ప్రతి దశలో ఏం జరుగుతోందో ఫిర్యాదుదారునికి ఎప్పటికప్పుడు ఈ-మెయిల్ లేదా ఎస్‌ఎంఎస్ ద్వారా తెలియజేస్తామని వివరించారు.





