
ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన నియోజకవర్గం వారణాసిలో బిజీబిజీగా గడుపుతున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని సోమవారం కాశీ వెళ్లిన విషయం తెలిసిందే. నిన్న ఉదయం నుంచి ఆలయ దర్శనాలు, పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మోడీ.. సాయంత్రం భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలతో భేటీ అయ్యారు. ఈ సమావేశం అర్ధరాత్రి వరకూ సాగింది. ఆ తర్వాత అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ప్రధాని మోడీ నగరంలో వారణాశి నగరంలో పర్యటనకు వెళ్లారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో కలిసి కొంతసేపు కాశీ వీధుల్లో నడిచారు. పలు ప్రాంతాల్లో పర్యటించి అక్కడి పనులను పరిశీలించారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలను మోడీ తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. ”కాశీలో పలు అభివృద్ధి పనులను పరిశీలించాం. ఈ పవిత్ర నగరంలో ఉత్తమ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మరింత కృషి చేస్తున్నాం” అని ప్రధాని తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాలతో పాటు బనారస్ రైల్వే స్టేషన్ ను కూడా ప్రధాని సందర్శించారు.





