News

ఐరాస పర్యావరణ తీర్మానాన్ని వ్యతిరేకించిన భారత్

263views

చెప్పిందొకటి.. రూపొందించినది మరొకటని విమర్శ

వాతావరణ మార్పులకు, ప్రపంచ భద్రత సవాళ్ళకు సంబంధించి ఐరాస భద్రతామండలి రూపొందించిన నమూనా తీర్మానాన్ని భారత్‌ వ్యతిరేకించింది. వాతావరణ మార్పులకు సంబంధించి ఇటీవల గ్లాస్గో శిఖరాగ్ర సమావేశంలో అతి కష్టమ్మీద కుదిరిన ఏకాభిప్రాయానికి ఇది వ్యతిరేకంగా ఉందని తేల్చి చెప్పింది. ఈ తీర్మానంలోని అంశాలు సభ్య దేశాల మధ్య అసమ్మతి బీజాలు నాటేలా ఉన్నాయని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పేర్కొన్నారు.

‘వాతావరణ సంబంధ భద్రత ముప్పు’ కేంద్రంగా వ్యూహాలను సిద్ధం చేయాలన్న సారాంశంతో… ఐర్లండ్‌, నైగర్‌లు ఈ ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. వీటో అధికారాన్ని ఉపయోగించి రష్యా దీన్ని అడ్డుకొంది. భారత్ సైతం దీనికి వ్యతిరేకంగా ఓటు వేసింది.

పేద దేశాల తరపున పోరాడుతాం

వాతావరణ పరిరక్షణకు సంబంధించిన వాస్తవ కార్యాచరణకు మా మద్దతుంటుందని భారత్ స్పష్టం చేసింది. ఆఫ్రికా సహా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల తరఫున మాట్లాడతామని… అయితే, దీనికి సరైన వేదిక ‘యునైటెడ్‌ నేషన్స్‌ ఫ్రేమ్ ‌వర్క్‌ కన్వెన్షన్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్’‌ అని భారత్ పేర్కొంది. అక్కడ తమ కృషి కొనసాగుతుందని.. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను ఫణంగా పెట్టి రూపొందించిన ఈ తీర్మానం… వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఐక్య పోరాటానికి విఘాతం కలిగించేలా ఉంది” అని భారత్‌ వెల్లడించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.