
-
విచారణకు ఆదేశించిన కేంద్రం
న్యూఢిల్లీ: ఎంపీ ల్యాడ్స్ నిధుల్ని హిందూ యేతర మత సంబంధ పనులకు కేటాయించారంటూ అందిన ఫిర్యాదుపై వాస్తవ నివేదికను వెంటనే పంపాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాసింది. ఇదే విషయమై గతంలో లేఖ రాసినా.. ఇప్పటికీ స్పందన లేదని కేంద్ర గణాంకశాఖ డిప్యూటీ డైరెక్టర్ పేర్కొన్నారు.
నివేదికను ప్రధాని కార్యాలయానికి పంపాల్సి ఉన్నందున, తక్షణం స్పందించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీల్యాడ్స్ నిధుల్ని నిబంధనలకు విరుద్ధంగా చర్చిల నిర్మాణం, మరమ్మతులకు కేటాయించారని ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధానమంత్రి కార్యాలయానికి గతంలో ఫిర్యాదు చేశారు. దాన్ని ప్రధాని కార్యాలయం కేంద్ర గణాంక శాఖకు పంపి.. విచారించాలని ఆదేశించింది. దాని ఆధారంగా కేంద్ర గణాంకశాఖ అక్టోబరు 21న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దానిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో.. ఆ అంశాన్ని గుర్తు చేస్తూ మళ్లీ లేఖ పంపారు.





