ArticlesNews

బలూచిస్తాన్ లోని బ్రాహుయి భాషకు దక్షిణ భారతదేశంలోని భాషలతో ఉన్న సారూప్యం దేనికి సూచిక?

73views

2016లో, భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఎర్రకోట ప్రాకారాల నుండి బలూచ్ స్వాతంత్ర్య పోరాటాన్ని గురించి ప్రస్తావించినప్పుడు, దానిని చాలా మంది అప్రస్తుత, అనాలోచిత ప్రసంగంగా అభివర్ణించారు. దానికి కారణం దక్షిణ భారతదేశంతో బలూచ్ సంస్కృతికి ఉన్న సంబంధం గురించి వారికెవరికీ తెలియకపోవడమే.

ప్రస్తుతం పాకిస్తాన్‌లో భాగమైన బలూచిస్తాన్ లో 2 మిలియన్ల మంది పాకిస్థానీయులు మాట్లాడే బ్రాహుయి భాషకు బలూచిస్తాన్ నుండి 2000 కి.మీ దూరంలో ఉన్న దక్షిణ-భారతదేశంలో మూలాలున్నాయి. ఈ భాష ప్రపంచవ్యాప్తంగా చాలా మందిలో ఉత్సుకతను రేకెత్తించింది, కానీ ఉపఖండంలో మాత్రం ఈ విషయం తగినంత అలజడిని సృష్టించలేదు.

బ్రాహుయ్ అంటే ఏమిటి?

బ్రహుయి అనేది ఒక గిరిజన సమూహానికి పెట్టబడిన పేరు. వీరిలో ఎక్కువ మంది పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో నివసిస్తున్నారు. వారు మాట్లాడే భాష పేరు కూడా బ్రహుయే. బ్రాహుయిలు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు తుర్కెమినిస్థాన్‌లో కూడా నివసిస్తున్నారు. వారు ఆకార వ్యవహారాల రీత్యా జాట్లు, బలూచ్‌ల లతో సమానంగా ఉంటారు. అయితే పాకిస్తాన్ ‌లోని సింధ్ ప్రాంతంలో నివసించే వారికి భిన్నంగా వీరి వేషభాషాది వ్యవహారాలుంటాయి. బ్రాహుయ్ భాష యొక్క వ్యాకరణ నిర్మాణం మరియు పదజాలం దక్షిణ-భారతదేశంలోని భాషలకు చాలా సారూప్యంగా ఉన్నందువల్ల, దీనిని భాషా శాస్త్రవేత్తలు ద్రావిడ భాషగా వర్గీకరించారు. కానీ బ్రాహుయి, భారతీయ భాషల వలె బ్రాహ్మిక్-లిపిలో ఉండదు. అరబిక్ మరియు లాటిన్ లిపిలో ఉంటుంది.

బ్రాహుయి భాషకు దక్షిణ భారతదేశంతో ఉన్నసారూప్యతను 1816లో H.పాటింగర్ అనే భాషా శాస్త్రవేత్త మొదటిసారిగా గుర్తించాడు. ఒక శతాబ్దం తర్వాత, 1909లో, డెనిస్ బ్రే అనే ఆంగ్లేయుడు, బ్రాహుయి యొక్క ఉచ్చారణ మరియు వ్యాకరణంపై ఒక పుస్తకాన్ని ప్రచురించాలని నిర్ణయించుకున్నాడు. అప్పటి నుండి, బ్రేను బ్రాహుయ్ అధ్యయనాల పితామహునిగా పిలుస్తారు.

దాదాపు 3.68 మిలియన్ల ప్రజలు తమను తాము బ్రాహుయులు‌గా గుర్తించుకుంటారు. ఈ జనాభాలో 60% కంటే ఎక్కువ మంది పాకిస్తాన్ ‌లో నివసిస్తున్నారు. అయినప్పటికీ, వారందరూ బ్రాహుయి భాష మాట్లాడరు. వారిలో కొందరు బ్రాహుయ్ మరియు బలోచ్ రెండింటినీ మాట్లాడేవారున్నారు. మరికొందరు బ్రాహుయి మాత్రమే మాట్లాడతారు.

బ్రాహుయ్ భాషకు దక్షిణ భారతదేశంతో ఉన్న సంబంధం

17వ శతాబ్దంలో మొఘల్ రాజ్య విస్తరణ సమయంలో బ్రాహుయ్ భాష గురించి చరిత్ర పుస్తకాలలో ప్రస్తావించడం ప్రారంభమైంది. బ్రాహుయ్ యొక్క పురాతన చరిత్ర గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఎందుకంటే నిరంతర దండయాత్రల కారణంగా ఈ ప్రాంతంలో ఆ భాషలో చేతి వ్రాతతో వ్రాయబడిన సాహిత్యం (వ్రాత ప్రతులు) నాశానమయ్యింది. దాంతో ఆ భాషకు సంబంధించిన ఆధారాలేవీ అందుబాటులో లేకుండా పొయ్యాయి. ఏవైనా కొన్ని వ్రాతప్రతులు లభిస్తూ ఉన్నా…. అవి కేవలం నిర్దిష్ట కథనాన్ని బలపరచడానికి వ్రాసిన చరిత్రే తప్ప మరొకటి కాదు. కాబట్టి 800 సంవత్సరాల క్రితం బలూచ్ గుర్తించే వరకు బ్రహూయిస్, గిరిజన సమూహాలు అజ్ఞాతంలో జీవిస్తున్నారని నమ్మడం కష్టం.

ప్రస్తుతం, బ్రాహుయులు ఉపయోగించే 15% పదాలు ద్రావిడ భాషలలోని పదాలను పోలి ఉంటాయి. ఇతర పదాలు బలూచ్ మరియు ఉర్దూ నుండి వచ్చిన పదాలు. ఒక అమెరికన్ భాషావేత్త మరియు సౌత్- ఏషియన్ భాషల నిపుణుడు, ఫ్రాంక్లిన్ సౌత్ ‌వర్త్, “ది ఇండో-ఆర్యన్స్ ఆఫ్ ఏన్షియంట్ సౌత్ ఏషియా : లాంగ్వేజ్, మెటీరియల్ కల్చర్ అండ్ ఎత్నిసిటీ” అనే తన పుస్తకంలో ఇలా ముగించారు– “సాధారణంగా ఉపయోగించే బ్రాహుయ్ ‌లో దాదాపు 300 ద్రావిడ పదాలు ఉన్నాయి.” అని. బ్రాహుయి భాషా పదాలకు దక్షిణ భారతీయ భాషలతో ఉన్న సారూప్యతను ఇప్పటివరకూ ఏ భాషా శాస్త్రవేత్తా ఖండించకపోవడం కూడా ఇక్కడ గమనార్హం.

యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ ‌లోని లింగ్విస్టిక్స్ ప్రొఫెసర్ ఉమా మహేశ్వర్ ప్రకారం, ద్రావిడ భాషలు మరియు బ్రాహుయిలో ఒకే విధమైన ఉచ్చారణ ఉన్న పదాల నమూనా ఇక్కడ ఉంది.

పర్వతాలు మరియు నదులచే వేరు చేయబడిన భౌగోళిక ప్రదేశాలలో ఉన్న భాషల మధ్య ఈ సారూప్యతలు శతాబ్దాలుగా మనుగడ సాగిస్తూ వుండడం కేవలం యాదృచ్చికం కాదు. ఫ్రాంక్లిన్ సౌత్ ‌వర్త్ మాటల్లో చెప్పాలంటే – “తమిళం, తెలుగు, తోడా, కొలామి, గోండి, మాల్టో, బ్రాహుయి మొదలైన భాషలను పరిశీలించినప్పుడు వీటన్నిటి మూలం ఒకటేనని మాకు అనిపిస్తూవుంది. ఈ ఆధునిక భాషల్లోని ప్రతి ఒక్కటీ ఆ పూర్వ సమాజం యొక్క చరిత్రకు కొనసాగింపుగా ఎంతో కొంత ఆ పూర్వ వాసనలను వెదజల్లుతూ ఉంటాయి. మనం సాధారణంగా సింధు లోయ నాగరికతగా పిలిచే సింధు-సరస్వతి నాగరికత శతాబ్దాల నుండి అక్కడ మనుగడ సాగించే బ్రాహుయి భాష మాట్లాడేవారితో ఇరాన్ కు కూడా వ్యాపించి ఉంది.

బ్రాహుయి ప్రజలు

దురదృష్టవశాత్తూ, బ్రాహుయి మాట్లాడే వారి సంఖ్య చాలా తక్కువగా ఉన్నందున, యునెస్కో దీనిని అంతరించిపోతున్న భాషల జాబితాలో చేర్చింది. పాకిస్తాన్ సెంట్రల్ సుపీరియర్ సర్వీసెస్ పరీక్షలో ప్రాంతీయ భాషలలో ఒకదానిగా బ్రాహుయిని కూడా చేర్చాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరుతూ పాకిస్తాన్‌లోని బ్రాహుయి మాట్లాడేవారు పోరాడుతున్నారు. అయితే ఇప్పటి వరకూ వారి విన్నపాలు ఫలించలేదు. ఎక్కువ మంది బ్రహుయిలు నివసించే బలూచిస్తాన్ ప్రాంతంలోని ప్రజలు ఇప్పుడు పాకిస్తాన్ నుండి తమకు స్వాతంత్ర్యం కావాలని పోరాడుతున్నారు. కానీ సహజ ఖనిజ వనరులు కలిగిన బలూచిస్తాన్ పై పాకిస్తానీ ప్రభుత్వం మరియు సైన్యం పట్టు సడలనివ్వటం లేదు. అటువంటి పరిస్థితులలో శతాబ్దాల చరిత్ర కలిగిన బ్రాహుయి భాష మనుగడ ప్రశ్నార్థకమే అవుతుంది.

Source : Resonant news

South India’s ancient connection to Balochistan, the Brahui language

తెలుగు అనువాదం – శ్రీరాంసాగర్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.