
నాగ్‌పూర్: కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లా, మాధవ్ నగర్‌లోని రాష్ట్రోత్తన విద్యా కేంద్రంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) అఖిల భారతీయ కార్యకారి మండల్(ఏబీకేఎం) బైఠక్ జరగనుంది. ఈ మేరకు సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు మూడు రోజులపాటు నిర్వహించనున్న ఈ సమావేశంలో పరమ పూజనీయ సర్ సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్, మాన్య సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబలే(ప్రధాన కార్యదర్శి)లతోపాటు క్షేత్ర, ప్రాంత్ అధికారులు.. ఇలా దేశవ్యాప్తంగా దాదాపు 350 మంది ప్రతినిధులు హాజరుకానున్నట్టు ఆయన పేర్కొన్నారు.
అఖిల భారతీయ ప్రతినిధి సభ(ఏబీపీఎస్) మార్చిలో జరుగుతుందని, అందులో సంఘ్ ప్రణాళికను రూపొందిస్తామని, ఇప్పుడు జరుగబోయేది ఆరు నెలల తర్వాత జరుగుతున్న సమీక్షా సమావేశమని తెలిపారు. విస్తరణ ప్రణాళికలు, కార్యకర్తల శిక్షణ, అనుభవాలు పంచుకోవడం వంటి సంస్థాగత కార్యకలాపాలు ఈ సమావేశంలో చర్చించుకోనున్నట్టు ఆ ప్రకటనలో వివరించారు. కాగా, బైఠక్ ప్రదేశంలో మీడియా ఇన్‌చార్జిగా అమృత్ జోషి(96061 45789) ఉంటారని అంబేకర్ తెలిపారు.





