
కశ్మీర్: కశ్మీర్ లోయలో ఒక వంక పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు సాధారణ పౌరులు, సైనికులపై గురిపెడుతూ తుపాకులు పేలుస్తుండగా, మరోవంక కొత్తగా ఏర్పడిన తీవ్రవాద సంస్థ ‘హర్కత్ 313’ ప్రభుత్వం నిర్మించిన మౌలిక సదుపాయాలపై గురిపెట్టిన్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దానితో భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి. గత రెండు వారాలుగా ఇప్పటికే ఉగ్రవాదుల కాల్పులలో 11 మంది సాధారణ పౌరులతో పాటు, తొమ్మిది మంది జవాన్లు అమరులయ్యారు. సాధారణ పౌరులలో ఐదుగురు స్థానికేతరులు. `హర్కత్’ పేరును మొదటిసారిగా వింటున్నామని, పూర్తిగా విదేశీ ఉగ్రవాదులతో నిండి ఉండవచ్చని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. అయితే, లష్కరే తొయిబా నుండి భద్రతా దళాల దృష్టి మళ్లించడానికి ఈ పేరును తెరపైకి తెచ్చారా, కొత్తగా ఏర్పడిందా తెలియవలసి ఉన్నదని చెప్పారు.
తాజా సమాచారం ప్రకారం, ‘హర్కత్ 313’ అనే కొత్త తీవ్రవాద సంస్థ ఉరిలోని జల విద్యుత్ (హైడ్రో పవర్) ప్లాంట్లను తమ దాడులకు లక్ష్యంగా చేసుకుంది. టెర్రరిస్టుల టార్గెట్‌లో అనంతనాగ్‌లోని ఎమర్జెన్సీ ల్యాండింగ్ స్ట్రిప్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో ఎల్ఓసీకి సమీపంలో ఉన్న ఉరి-1, ఉరి-2 హైడ్రో పవర్ ప్రాజెక్టుల చుట్టూ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మరోవంక, కశ్మీర్ లోయలోని మత నాయకులపై దాడులకు హిజ్బుల్ ముజాహిద్దీన్ తీవ్రవాద సంస్థ ప్రణాళిక రూపొందించినట్టు ఇంటెలిజెన్స్ సమాచారం. అలాగే సర్పంచులు, స్థానికేతరులను పాకిస్థాన్ ప్రేరేపిత లష్కరే తొయిబా, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్) లక్ష్యంగా చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది.
Source: Nijamtoday





