
దేశ సరిహద్దుల్లో అలజడి సృష్టించేందుకు అనునిత్యం కుట్రలు చేస్తున్న పాకిస్థాన్ కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గట్టి వార్నింగ్ ఇచ్చారు. సరిహద్దులలో అతిక్రమణలకు పాల్పడినా, కాశ్మీర్‌లోని అమాయక ప్రజల్ని పొట్టనపెట్టుకునేందుకు ఉగ్రవాదాన్ని ఎగదోస్తే మరిన్ని మెరుపుదాడులు తప్పవని హెచ్చరించారు. భారత్ పై దాడుల్ని సహించబోమని గతంలో సర్జికల్ దాడులతో నిరూపించామన్నారు. గురువారం ఆయన గోవాలోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ (ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ)కి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మాజీ మంత్రి మనోహర్ పారికర్ ల సారథ్యంలో పాకిస్థాన్ పై జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ ఓ కీలక అడుగు అన్నారు. దేశ సరిహద్దుల్లో ఆటంకాలు సృష్టించొద్దన్న సందేశం పంపామన్నారు. అప్పుడు చర్చలకు సమయం ఉండేది.. కానీ ఇప్పుడు మాత్రం బదులిచ్చే సమయం వచ్చేసిందని అమిత్ షా వ్యాఖ్యానించారు. గతంలో ఉరీ, పఠాన్ కోట్, గురుదాస్ పూర్ లలో పాక్ ఉగ్రమూకల దాడులకు భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్ లోని ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడులు జరిపి ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.