
-
20 మంది మృతి, వందలాది మందికి గాయాలు
లాహోర్: పాకిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. దీంతో ఆ దేశం చిగురుటాకులా వణికిపోయింది. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని హర్నోయ్‌లో గురువారం తెల్లవారుజామున 3.30 సమయంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడిరచింది. కాగా.. ఈ భూకంపం ధాటికి 20 మంది చనిపోయారని, 200 మందికి పైగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు.
మృతుల్లో మహిళలు, ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నట్టు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని బలూచిస్థాన్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అధికారి నసీర్ నాసర్ మీడియాకు వెల్లడిరచారు. ప్రజలంతా నిద్రలో ఉండగా భారీ భూకంపం సంభవించింది. భవనాల పైకప్పులు కూలిపడటంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగినట్టు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
మారుమూల పర్వత ప్రాంతమైన హర్నాయ్‌కు రోడ్లు, విద్యుత్, మొబైల్ ఫోన్ కవరేజీ లేకపోవడం వల్ల సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స కోసం క్వెట్టా ఆసుపత్రికి తరలిస్తున్నట్టు పేర్కొన్నారు. భూకంపం వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆరోగ్యకార్యకర్తలు టార్చ్ లైట్ల సాయంతో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు.





