News

ఫేస్‌బుక్‌తో ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనం

382views
  • ఆ సంస్థ మాజీ ఉద్యోగి వెల్లడి

న్యూఢిల్లీ: ఫేస్‌బుక్‌పై ఆ సంస్థ మాజీ డాటా సైంటిస్టు ఫ్రాన్సెస్‌ హాగెన్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఎఫ్‌బీ, ఇన్‌స్టాగ్రామ్‌ల వినియోగం వల్ల పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతినే ముప్పు ఉంటుందని హెచ్చరించారు. యువత ఆహారపు అలవాట్లు, ఆలోచనా విధానాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసేందుకు ఈ యాప్‌లు కారణమవుతున్నాయని ఆమె అన్నారు. ఎఫ్‌బీ వల్ల సామాజిక విభేదాలు తలెత్తుతున్నాయని, ఫలితంగా ప్రజాస్వామ్య వ్యవస్థలు బలహీనపడే పరిస్థితి ఉందని హాగెన్‌ ఆవేదన వ్యక్తంచేశారు.

ఇందుకు సంబంధించిన పలు ఆధారాలను అమెరికా కాంగ్రెస్‌, సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌, ద వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌లకు ఆమె అందించారంటూ పలు మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ‘వినియోగదారుల భద్రత కంటే లాభాలే ఫేస్‌బుక్‌కు ఎక్కువ.. ఆ కంపెనీ అల్గారిథమ్‌ లాభాలు పండిరచేలా ఉన్నాయే తప్ప వినియోగదారుల భద్రతకు భరోసా ఇచ్చేలా లేవు. దాన్ని వెంటనే కట్టడి చేయాలి’ అని అమెరికా కాంగ్రెసకు చెందిన ఎగువ సభ అయిన సెనెట్‌ ఏర్పాటుచేసిన ఓ కమిటీకి హాగెన్‌ నివేదించారు. ఆమె ఆరోపణలపై ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ స్పందించారు. తన ఎఫ్‌బీ అకౌంట్‌  వేదికగా సంస్థ ఉద్యోగులను ఉద్దేశించి ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ఆరోపణల్లో హేతుబద్ధత లేదని స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి