News

‘చీరే’ గెలిచింది!

534views
  • ఢిల్లీలోని అక్విలా రెస్టారెంట్‌ మూసివేత

న్యూఢిల్లీ: పాశ్చాత్య వస్త్రధారణ మోజులో పడ్డ జనం తమ జీవితాలను ఇబ్బందులకు గురిచేసుకుంటూ, చివరకు గౌరవమైన భారతీయత వైపు మళ్ళుతున్నారు. ఈ వాస్తవం దేశంలోని కొన్ని రెస్టారెంట్లకు ఇంకా తెలియడం లేదు. గత వారం దక్షిణ ఢిల్లీలోని అక్విలా రెస్టారెంట్‌లోకి చీరకట్టుతో వెళ్ళిన మహిళకు అనుమతి లభించని విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీంతో ఆ రెస్టారెంట్‌పై  మున్సిపల్‌ కార్పోరేషన్‌ అధికారులు కొరడా ఝ‌లిపించారు. లైసెన్స్‌ లేని కారణంగా రెస్టారెంట్‌కు నోటీసు జారీ చేశారు.

బాధిత మహిళ తనకు ఎదురైన చేదు అనుభవానికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో పెద్ద చర్చకు దారి తీసింది. స్మార్ట్‌ డ్రెస్‌ కాదంటూ చీరకట్టుతో వచ్చిన ఆ మహిళను రెస్టారెంట్‌ సిబ్బంది లోనికి అనుమతి లేదని చెబుతున్న దృశ్యాలు అందులో రికార్డయ్యాయి. రెస్టారెంట్‌ నిర్వాకంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి. భారత సంప్రదాయంలో భాగమైన చీరకట్టును అవమానించిన రెస్టారెంట్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ వ్యక్తమైంది.

దక్షిణ ఢిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ ముఖేష్‌ సూర్యన్‌ దీనిని ధ్రువీకరించారు. అక్విలా రెస్టారెంట్‌ చెల్లుబాటు అయ్యే లైసెన్స్‌ లేకుండా పనిచేస్తున్నట్టు చెప్పారు. మేము మూసివేత నోటీసు జారీ చేసాం… ఆ తర్వాత ఇప్పుడు మూసివేయబడిరది. ఎలాంటి అనుమతి లేకుండా రెస్టారెంట్‌ నడుస్తోంది. అందువల్ల, డీఎంసీ చట్టం కింద జరిమానా.. ఇతర నిబంధనలు ఉల్లఘించినందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

  • రెస్టారెంట్‌కు నోటీసులు

ఆండ్రూస్‌ గంజ్‌లోని అన్సల్‌ ప్లాజాలోని అక్విలా రెస్టారెంట్‌ను మూసివేయడానికి నోటీసు జారీ చేసినట్టు అధికారులు బుధవారం తెలిపారు. ఈ నెల 21న, ఆ ప్రాంతంలోని పబ్లిక్‌ హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ విచారణలో, ఆరోగ్య ట్రేడ్‌ లైసెన్స్‌ లేకుండా అపరిశుభ్రతతో ఈ సంస్థ పనిచేస్తోందని తేలింది. రెస్టారెంట్‌ చట్టవిరుద్ధంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించిందని పేర్కొన్నారు.

  • తనిఖీలు

పబ్లిక్‌ హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ ఈ నెల 24న మళ్లీ తనిఖీ చేశారు. వ్యాపారం అదే స్థితిలో కొనసాగుతున్నట్టు గుర్తించారు. ఈ నోటీసు అందిన తేదీ నుండి 48 గంటలలోపు వ్యాపారాన్ని మూసివేయాలని అధికారులు నిర్వాహకులను హెచ్చరించారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి