News

సూసైడ్ బాంబర్లు, ఆయుధాలతో తాలిబన్ల పరేడ్

1.1kviews

ఫ్ఘనిస్తాన్ ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత తమ దగ్గర ఉన్న ఆయుధాలను ప్రపంచ దేశాలకు చూపించాలని తాలిబాన్లు భావించినట్టున్నారు. అందులో భాగంగా తమ దగ్గర ఉన్న ఆయుధాలతో పరేడ్ ను నిర్వహించారు. అంతేకాకుండా ఆఫ్ఘనిస్థాన్ మీడియాలో లైవ్ టెలికాస్ట్ చేయించారు. తాలిబాన్ల ఆధ్యాత్మిక కేంద్రమైన కాందహార్ వీధుల్లో “విక్టరీ ల్యాప్” సమయంలో బ్లాక్‌హాక్ హెలికాప్టర్‌తో కవాతు చేసిన తరువాత, ఇప్పుడు తన సైనిక శక్తిని ప్రదర్శిస్తూ మరొక కవాతును నిర్వహించారు తాలిబన్లు. తాలిబాన్లు తమ కవాతులో ఆత్మాహుతి దళాలు, కారు బాంబులు, బారెల్ బాంబులు, పేలుడు పదార్థాలు మొదలైనవన్నీ ప్రదర్శించారు. ఆఫ్ఘనిస్థాన్ పబ్లిక్ బ్రాడ్ ‌కాస్టర్ అయిన రేడియో టెలివిజన్ ఆఫ్ఘనిస్తాన్ (RTA) లో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమైంది. ఇస్లామిక్ ఎమిరేట్స్ జెండాను మోసుకుంటూ ఓ బృందం కవాతు చేయడం కూడా కనిపించింది.

ఈ కార్యక్రమంలో తాలిబన్లు తేలికపాటి ఆయుధాలు, భారీ ఆయుధాలు, మైన్స్, ఎల్లో బారెల్స్, కారు బాంబులను ప్రదర్శించారు. దేశ స్వాతంత్ర్యం, దేశ రక్షణకు వ్యతిరేకంగా ఉన్న ఆక్రమణదారులు మరియు వారి తొత్తులపై ఈ ఆయుధాలు ఉపయోగించబడుతాయని తాలిబాన్ వ్యాఖ్యాత చెప్పారు. ఈ ఆయుధాలలో అత్యంత ప్రాముఖ్యమైనవి ఎల్లో బారెల్, వెస్ట్ బాంబు మరియు కార్ బాంబులు అని తాలిబాన్లు చెప్పారు. శత్రువుల వాహనాలను నాశనం చేయగల ఎల్లో బాంబులు, ముజాహిదీన్ సైనిక పరిశ్రమ యొక్క గొప్ప ఆవిష్కరణ అని ఆ వ్యాఖ్యాత పేర్కొన్నాడు. తాలిబాన్లు సూసైడ్ బాంబులను కూడా ప్రదర్శించారు. దీనిని వారు శత్రువులకు చెందిన లక్ష్యాలను నాశనం చేయడానికి ఉపయోగిస్తారని తెలిపారు. ఇరానియన్ జర్నలిస్ట్ తాజుడెన్ సోరౌష్ పంచుకున్న మరో వీడియోలో, తాలిబాన్ యోధులు తమ కరాటే నైపుణ్యాలను ప్రదర్శించారు.

నిజానికి తాలిబన్లు ప్రదర్శిస్తున్న ఆయుధాలు వారికి చెందినవి కావని ప్రపంచం మొత్తానికి తెలుసు. ప్రస్తుతం తాలిబన్ల చేతుల్లో ఉన్న చాలా ఆయుధాలు గతంలో ఆఫ్ఘన్ జాతీయ దళాల నుండి తాలిబన్ లు దోచుకున్నవే. ఆఫ్ఘన్ జాతీయ దళాలు తాలిబాన్లకు వ్యతిరేకంగా చేసిన యుద్ధంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అందించింది. యుఎస్ దళాలు ఆఫ్ఘనిస్తాన్ నుండి వైదొలిగిన తరువాత ఆఫ్ఘన్ దళాలు తాలిబన్లకు లొంగిపోయాయి. తాలిబన్లు దేశాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత, ఆ ఆయుధాలన్నీ తాలిబాన్ల హస్తగతమయ్యాయి. ఆఫ్ఘన్ జాతీయ దళాలకు చెందిన ఆయుధాలతో పాటు, ఆఫ్ఘనిస్థాన్ లో అమెరికా దళాలు విడిచిపెట్టిన అధునాతన అమెరికన్ ఆయుధాలు మరియు వాహనాలు కూడా తాలిబన్ ల చేతుల్లోకి వెళ్ళిపోయాయి.

ఆగష్టు 31, 2021 న అధికారికంగా ఆఫ్ఘనిస్తాన్ నుండి బయలుదేరిన US దళాలు దాదాపు 80 బిలియన్ డాలర్ల విలువైన సైనిక పరికరాలను వదిలిపెట్టాయి. అమెరికా 2003 నుండి ఆఫ్ఘన్ దళాలకు 16,000 కంటే ఎక్కువ నైట్-విజన్ గాగుల్ పరికరాలు, 600,000 పదాతిదళ ఆయుధాలు, M16 అస్సాల్ట్ రైఫిల్స్ మరియు 162,000 కమ్యూనికేషన్ పరికరాలను అందించింది. అంతేకాకుండా, రైఫిల్స్, మెషిన్ గన్స్, పిస్టల్స్, గ్రెనేడ్ లాంచర్లు మరియు RPG ల వంటివి 6 లక్షలకు పైగా చిన్న ఆయుధాలు తాలిబన్ ల చేతుల్లో పడ్డాయి. తాలిబన్లు నిఘా పరికరాలు, రేడియో వ్యవస్థలు, డ్రోన్‌లు మొదలైన వాటిని భద్రపరిచారు. ఈ ఆయుధాలను తాలిబన్లు దేని కోసం ఉపయోగిస్తారోనని ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.