
మహిళా షూటర్ అవని లేఖరా అదరగొట్టింది. పారాలింపిక్స్ లో భారత్ కు తొలి స్వర్ణం సాధించి పెట్టింది. 10మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఆమె బంగారు పతకాన్ని సాధించింది. పారాలింపిక్స్ లో స్వర్ణం సాధించిన భారత తొలి మహిళగా అవని రికార్డు సృష్టించింది.
అవని లేఖరా నేపథ్యం ఇదీ..
జైపురకి చెందిన పందొమ్మిదేళ్ల రైఫిల్ షూటర్ అవని.. టోక్యో పారాలింపిక్స్‌లో పాల్గొన్న పిన్న వయస్కురాళ్ళలో ఒకరు. అది 2012. అప్పటికి అవనికి పదేళ్లు. ఓ కారు ప్రమాదంలో తన వెన్ను పూస విరిగిపోయింది. నడుము కింద భాగం చచ్చుబడి ఆ అమ్మాయి చక్రాల కుర్చీకే పరిమితమైంది. మూడేళ్లపాటు ఎన్నో సర్జరీలు, ఫిజియోథెరపీ సెషన్లు…! అయినా ఫలితంలేదు. బడిలో చేర్చుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో రెండేళ్లు ఇంట్లోనే చదువుకుంది. తర్వాత కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సీటు దొరికింది. ‘బాధను దిగమింగుకోవడం సులువు కాలేదు. మనసు మళ్లేందుకు ఏదైనా రంగంలో పట్టు సాధించాలని నిర్ణయించుకుంది. ఆమె నాన్న కూడా అదే సూచించాడు. ఆయనోసారి ఆర్చరీ, షూటింగ్ రేంజ్ లకు అవనిని తీసుకెళ్లారు. అక్కడ మొదటిసారి రైఫిల్ ని చేతితో తాకినప్పుడే అవని దాంతో ప్రేమలో పడిపోయింది. నాలో స్ఫూర్తి నింపడానికి ఆయన… అభినవ్ బింద్రా రాసిన ‘ఎ షాట్ ఎట్ హిస్టరీ’ పుస్తకం ఇచ్చారని, అది చదివాక సీరియస్ గా సాధన ప్రారంభించానని, ఎప్పటికైనా దేశానికి బంగారు పతకం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నానని అంటోంది అవని. గత కొన్నేళ్లుగా అవని సాధించిన విజయాలు ఆమె పట్టుదలకు నిదర్శనం. శిక్షణ తీసుకున్న మొదటి ఏడాదే జాతీయ ఛాంపియన్ షిప్ పోటీల్లో మూడు పతకాలు అందుకుంది. అప్పటికి ఆమెకో సొంత రైఫిల్ కూడా లేదు. కోచ్ దగ్గర అరువు తెచ్చుకుంది. 2017లో ఆన్‌ఐన్‌ఓలో జరిగిన పారా షూటింగ్ వరల్డ్ కప్ లో రజతాన్ని అందుకుంది. కరోనా కారణంగా గతేడాదిగా ఫిజియోథెరపీ సెషన్‌లు పెద్దగా లేకపోయినా, సరైన శిక్షణా సదుపాయాలు, పరికరాలు లేకపోయినా…. ఇంటి దగ్గరే సాధన చేసి పారాలింపిక్స్ లో స్వర్ణ పతకాన్ని ముద్దాడింది అవని లేఖరా.
బంగారు పతకాన్ని ముద్దాడిన సుమిత్ అంటిల్
పారాలింపిక్స్ లో సోమవారం భారత్ కు మరో స్వర్ణం దక్కింది. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్-64 విభాగంలో సుమిత్ అంటిల్ బంగారు పతకాన్ని ముద్దాడాడు. ఈ క్రమంలో అతను మూడుసార్లు ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తొలి ప్రయత్నంలోనే 66.95 మీటర్లతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన అతడు.. రెండో ప్రయత్నంలో 68.08 మీటర్లు విసిరి తన రికార్డును తానే తిరగరాశాడు. ఇక ఐదో ప్రయత్నంలో మరింత వేగంతో ఈటెను విసరగా అది 68.55 మీటర్లు దూసుకెళ్లడంతో కొత్త చరిత్ర సృష్టించాడు. దీంతో సుమిత్ పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు ఆస్ట్రేలియాకు చెందిన మైఖల్ బురియన్ 66.29 మీటర్లతో రజతం సాధించగా, శ్రీలంక అథ్లెట్ దులాన్ కొడితువక్కు 65.61 మీటర్లతో మూడో స్థానంలో కాంస్యం కైవసం చేసుకున్నాడు. భారత్ ఇవాళ మొత్తం ఐదు పతకాలు సాధించగా.. అందులో ఇది రెండో స్వర్ణం కావడం విశేషం.
హరియాణాలోని సోనేపట్ కు చెందిన సుమిత్ 2015 వరకు అందరి యువకుల్లానే సాదాసీదాగా ఉన్నాడు. అయితే బైక్ యాక్సిడెంట్‌లో ఎడమకాలు పోగొట్టుకొని కృత్రిమకాలుతో జీవనం సాగిస్తున్నాడు. తన ఊర్లో ఉండే ఒక పారా అథ్లెట్‌ను చూసి సుమిత్ కూడా అథ్లెటిక్స్ వైపు దృష్టి మళ్లించాడు. అలా 2018లో జావెలిన్ త్రో విభాగంలో పోటీపడటం ప్రారంభించి ఇప్పుడు పారాలింపిక్స్ లో చరిత్ర సృష్టించేవరకు తనని తాను తీర్చిదిద్దుకున్నాడు. ఈ క్రమంలోనే 2019లో దుబాయ్ లో నిర్వహించిన ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీల్లో ఎఫ్-64 విభాగంలోనే పోటీపడి రజతం సాధించాడు. ఇక ఈ ఏడాది మార్చిలో పాటియాలాలో నిర్వహించిన ఇండియన్ గ్రాండ్ ప్రి సిరీస్ 3 పోటీల్లో ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రాతో పోటీపడ్డాడు. అయితే, సుమిత్ అప్పుడు 66.43 మీటర్లతో ఏడో స్థానంలో సరిపెట్టుకున్నాడు. మరోవైపు చోప్రా 88.07 మీటర్లతో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.





