News

దివ్యాంగుల ఒలంపిక్స్ : టేబుల్ టెన్నిస్ విభాగంలో భారత్ కు తొలి రజతం సాధించిన భవీనాబెన్..

286views

టోక్యో పారాలింపిక్స్ లో భారత‌ టేబుల్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ భవీనాబెన్ పటేల్ చరిత్ర సృష్టించింది. భారత్ ‌కు తొలి పతకం అందించింది. స్వర్ణ పతకం పోరులో భాగంగా ప్రపంచ నెంబర్ ‌వన్‌ చైనా క్రీడాకారిణి యింగ్ జావోతో ఫైనల్ మ్యాచ్ ఆడిన భవీనాబెన్.. 0-3 తేడాతో ఓటమిపాలైంది. దీనితో ఆమె రజిత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టోర్నీ మొదటి నుంచి భవీనాబెన్.. అద్భుతంగా రాణిస్తూ త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించింది. కాగా, పారాలింపిక్స్‌ టేబుల్ టెన్నిస్ విభాగంలో భారత్ ‌కు ఇదే తొలి పతకం కావడం గమనార్హం.

గుజరాత్ ‌కు చెందిన భవీనాబెన్ తొలిసారి 2016 రియో పారాలింపిక్స్ ‌కు ఎంపికైంది. అయితే ఆమె సాంకేతిక కారణాల వల్ల ఆ పోటీల్లో పాల్గొనకలేకపోయినప్పటికీ.. పట్టుదలను మాత్రం వీడలేదు. టోక్యో పారాలింపిక్స్‌లోకి అడుగుపెట్టింది. మొదటి మ్యాచ్ నుంచి తన స్థాయికి మించిన ప్రదర్శన కనబరిచింది. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన భవీనా పోలియో కారణంగా చిన్నప్పటి నుంచి చక్రాల కుర్చీకే పరిమితమైంది. ఆ సమయంలో కుటుంబం అండగా నిలిచింది. ఆమెను ప్రోత్సహించింది. 2004లో భవీనా తండ్రి ఆమెను అహ్మదాబాద్‌లోని బ్లైండ్ పీపుల్స్ అసోసియేషన్‌లో చేర్పించడంతో టేబుల్ టెన్నిస్ కెరీర్ ‌కు అంకురార్పణ జరిగింది. వైకల్యం ఉందని బాధపడకుండా.. పట్టుదలతో శ్రమించింది.. జాతీయ ఛాంపియన్ ‌గా నిలిచింది. పారాలింపిక్స్ ‌లో పతకం గెలిచిన రెండో భారత మహిళా అథ్లెట్ ‌గా రికార్డు సృష్టించింది.

భవీనాకు రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు :

భవీనాబెన్‌ పటేల్ ‌కు రాష్ట్రపతి రామ్ ‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. భవీనా బెన్‌ సంకల్పం, నైపుణ్యాలు దేశానికి కీర్తి తెచ్చాయని రాష్ట్రపతి కొనియాడారు. రజత పతకంతో భవీనా చరిత్ర లిఖించిందని ప్రధాని మోడీ అన్నారు. ఆమెకు అభినందనలు తెలిపారు. భవీనా జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.