రోమన్ క్యాథలిక్ లలో బ్రాహ్మణ సామాజిక వర్గం మూలాలు – సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అధ్యయనంలో వెల్లడి..
రోమన్ క్యాథలిక్స్ మూలాలు బ్రాహ్మణ సామాజిక వంశాల నుంచి వచ్చాయా.. ? సనాతన వలస విధానంలో అనేక మార్పులు జరిగాయా? అంటే అవుననే అంటోంది సీసీఎంబీ. ఈ పరిశోధనలో ఒకే మూలం నుంచి వచ్చిన రెండు భిన్నమైన కోణాలని సీసీఎంబీ అభిప్రాయపడింది. మన దేశ పశ్చిమ తీరంలోని రోమన్ క్యాథలిక్స్ మూలాలను కనుగొనేందుకు.. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఒక అధ్యయనం చేసింది. వీరిలో అధికులు గౌర్ సారస్వత్ సామాజిక వంశానికి దగ్గరగా ఉన్నారని జన్యు అధ్యయనం ఆధారంగా నిర్ధారించామన్నారు డాక్టర్ తంగరాజ్. ఇండో-యూరోపియన్ నిర్దుష్ట జన్యుకూర్పు ఉన్న క్యాథలిక్స్.. భారత్‌లోని బ్రాహ్మణ సామాజిక ప్రారంభ వంశాల మూలాలని తేల్చారు.
అంతేకాదు, అటు.. యూదులతో సంబంధాలున్నట్లు సంకేతాలనూ గుర్తించామని సీసీఎంబి తెలిపింది. మన దేశంలో రోమన్ క్యాథలిక్స్ ఎక్కువగా పశ్చిమ తీర ప్రాంతంలోని గోవా, కుమ్తా, మంగళూరుల్లో ఉంటున్నారు. వీరి మూలాలపై గతంలోనూ చర్చలు నడిచినా, జన్యుపరమైన అధ్యయనాలు జరగలేదు. వీరి పూర్వీకుల గుట్టు తేల్చేందుకు సీసీఎంబీ నాలుగేళ్లుగా చేసిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. తంగరాజ్‌తో లఖ్‌నవూకు చెందిన బీఎస్‌ఐపీ సంస్థ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నీరజ్‌రాయ్ సంయుక్తంగా పరిశోధన చేశారు. మొత్తం 110 మంది డీఎన్‌ఏలను విశ్లేషించారు. భారత్‌తో పాటు పశ్చిమ యూరేషియా నుంచి గతంలో సేకరించిన డీఎన్‌ఏ సమాచారంతో పోల్చి చూశారు. ఎక్కువ మంది రోమన్ క్యాథలిక్స్‌లో గౌర్ సారస్వత్ సామాజిక మూలాలున్నట్లు.. ఈ బృందం గుర్తించింది.
పితృ వారసత్వంగా వచ్చిన వై క్రోమోజోమ్‌లతో 40 శాతానికి పైగా ఆర్‌ఐ1ఏ ఉన్నట్టు నిర్ధారణకు వచ్చారు. ఇలాంటి జన్యు సంకేతం ఉత్తర భారతదేశం, మధ్య ప్రాచ్య, ఐరోపా జనాభాలో సాధారణంగా కనిపించింది. కొంకణ్ ప్రాంత జనాభాలోనూ ఇలాంటి డీఎన్‌ఏ ఉందని తంగరాజ్ అన్నారు. గత 2500 సంవత్సరాల నుంచి నిరంతర వలసలు, వేర్వేరు జాతుల కలయికలతో ఇలాంటి మార్పులు జరిగాయన్నారు. ఈ పరిశోధన ఒక ఇంట్రస్టింగ్ పాయింట్ అని, ఒకే మూలం నుంచి వచ్చిన రెండు భిన్నమైన కోణాలని సీసీఎంబీ అభిప్రాయపడింది.