News

మాఫియా నుండి మేం స్వాధీనం చేసుకున్న భూములు దళితులు, పేదలకే – యూపీ సీఎం యోగి

750views

పాలనలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్టైలే వేరు అని అంటుంటారు. తాజాగా యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో మాట్లాడుతూ రౌడీలు, గూండాలు, మాఫియా నుండి స్వాధీనం చేసుకున్న భూములను ప్రజల కోసం వినియోగించనున్నామన్నారు. ఆగష్టు 19 గురువారం నాడు తన ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సప్లిమెంటరీ బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నప్పుడు సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ రౌడీలు, గూండాలు, మాఫియా ఆక్రమణల నుండి విముక్తి పొందిన భూములలో దళితులు, పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించారు. మాఫియాకు తమ ప్రభుత్వం ఎప్పటికీ మద్దతు ఇవ్వదని.. మాఫియా మీద చర్యలు తీసుకోవడమే తమ ప్రభుత్వానికి తెలుసునని అసెంబ్లీలో చెప్పారు యోగి ఆదిత్యనాథ్.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేపట్టిన వెంటనే యోగి ప్రభుత్వం భూ మాఫియాపై కఠినంగా వ్యవహరిస్తోంది. ల్యాండ్ మాఫియా అని పిలవబడే చాలా మంది రాజకీయ నాయకులకు యోగి ప్రభుత్వం చెమటలు పట్టించింది. చాలా మంది భూముల కుంభకోణాలకు పాల్పడిన వారు వివిధ రాజకీయ పార్టీలతో సంబంధాలు కలిగి ఉన్నారు. ఎంతో మంది చట్టవిరుద్ధంగా ఆక్రమించిన వందలాది ఎకరాల భూమిని, తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 23 న ఉత్తర ప్రదేశ్ శాసన మండలిలో ప్రసంగించిన సిఎం యోగి ఆదిత్యనాథ్.. 2017 లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో 67,000 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను మాఫియా బారి నుండి విముక్తి చేసినట్లు తెలియజేశారు.

మరో వైపు యోగి ఆదిత్యనాథ్ ఎవ్వరి పేర్లూ చెప్పకుండా తాలిబాన్ పట్ల సానుభూతి చూపుతున్న విపక్ష పార్టీల సభ్యులపై నిప్పులు చెరిగారు. ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలు, పిల్లలపై తాలిబాన్ లు క్రూరంగా ప్రవర్తిస్తున్నప్పటికీ కొంతమంది సిగ్గులేకుండా వారికి మద్దతు ఇస్తున్నారని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. వారికి మద్దతు ఇస్తున్న ముఖాలన్నీ బహిర్గతమవ్వాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్‌ తాలిబాన్ నియంత్రణలోకి వచ్చిన రెండు రోజుల తరువాత, ఉత్తర ప్రదేశ్ సంబల్ నుండి సమాజ్ ‌వాదీ పార్టీ ఎంపీ షఫీఖర్ రహమాన్ బార్క్ తాలిబాన్లకు తన మద్దతును ప్రకటించారు. మంగళవారం ఆగస్టు 17 న, తాను చేసిన తన వివాదాస్పద ప్రకటనల కారణంగా వార్తల్లో నిలిచారు ఎస్‌పి ఎంపి. “తాలిబానీలు తమకు చెందిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారంతే” అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరుసటి రోజు ఉత్తర ప్రదేశ్ ‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం షఫీఖర్ రెహ్మాన్ బుర్క్ పై దేశద్రోహం, శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, తాలిబాన్లకు బహిరంగ మద్దతు కోసం మతపరమైన మనోభావాలను దెబ్బతీసే ఆరోపణలపై కేసు నమోదు చేసింది.

Source : Nationalist Hub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.