
బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కు షాక్ తగిలింది. బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న హింస ఘటనల కేసులను సీబీఐకి అప్పగించి విచారణ జరిపించాలని కోల్‌కత్తా హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. హింసాత్మక ఘటనలపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొంది. అత్యాచారం, హత్య కేసులన్నీ సీబీఐకి బదిలీ చేయాలని ఆదేశాలు జారీచేసింది. కోర్టు పర్యవేక్షణలోనే దర్యాప్తు జరపాలని స్పష్టం చేసింది.
ఆరు వారాల్లో సిట్, సీబీఐలు రెండూ తమకు నివేదిక అందించాలని కోల్‌కత్తా హైకోర్టు ఆదేశించింది. బెంగాల్లో ఎన్నికల ఫలితాల విడుదల తర్వాత బీజేపీ మద్ధతుదారులపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా బెంగాల్లోకి చొరబడి ఉన్న బంగ్లాదేశీ ముస్లిములు, స్థానిక ముస్లిములు, కొందరు ( అందరూ కాదు) తృణమూల్ మద్దతుదారులు బీజేపీ సానుభూతిపరులపై హింసకు పాల్పడ్డారు.
ఇప్పటికే హింసాత్మక ఘటనలు జరిగిన ప్రదేశాలలో గవర్నర్ పర్యటించి కేంద్రానికి నివేదిక అందజేశారు. రాష్ట్రంలో భారీస్థాయిలో ఎన్నికల అనంతరం హింస చోటుచేసుకున్న విషయం ఇటు గవర్నర్ నివేదికలోనూ, అటు జాతీయ SC కమీషన్ నివేదికలోనూ స్పష్టంగా వెల్లడైంది. ఇంత జరుగుతూన్నా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం “అదంతా అబద్ధం, ఒక వర్గం మీడియా సృష్టి” అంటూ ఇప్పటివరకూ బుకాయిస్తూ వచ్చారు. అలాగే బెంగాల్ హింసపై ఎన్ని వార్తలు వెలువడుతూ వుండినా ఒక వర్గం మీడియా మాత్రం ఆ విషయంపై మౌనం వహించడాన్ని కొందరు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇప్పుడు వెలువడ్డ ఈ తాజా హైకోర్టు ఆదేశాలతో అయినా నిందితులకు శిక్షపడి అమాయకులకు న్యాయం జరుగుతుందేమోననే ఆకాంక్షను పలువురు వ్యక్తం చేస్తున్నారు.





