ఆఫ్గన్లో వందల ఏళ్లనాటి దేవాలయాన్ని వీడనంటున్న పూజారి… తాలిబన్లు చంపినా సరే దైవారాధనే ముఖ్యమంటున్న వైనం..

ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన అఫ్గానిస్థాన్ నుంచి బయటపడేందుకు అక్కడి పౌరులు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అఫ్గాన్‌లోని ఓ హిందూ పురోహితుడు మాత్రం దేశం విడిచి వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు. దేశం వదిలి వెళ్లే అవకాశం వచ్చినా.. తిరస్కరించారు. పండిత్ రాజేశ్ కుమార్ కాబుల్‌లోని రతన్ నాథ్ మందిరంలో పూజారిగా సేవలందిస్తున్నారు. వందల ఏళ్ల నుంచి తన పూర్వీకులు ఈ మందిరాన్ని సంరక్షిస్తూ వచ్చారని, అలాంటి గుడిని ఇప్పుడు విడిచిపెట్టలేనని అంటున్నారు. ఒకవేళ తాలిబన్లు తనను చంపేసినా.. దాన్ని సేవగా భావిస్తానని చెప్పారు. గుడికి వచ్చే చాలా మంది హిందువులు, భక్తులు తమతో పాటు వచ్చేయాలని కోరినట్లు రాజేశ్ తెలిపారు. కానీ, అందుకు తాను నిరాకరించానని వెల్లడించారు.
ఈయన గురించి వీడియోను ఓ నెటిజన్ ట్విట్టర్లో షేర్ చేయగా.. అనేక మంది రాజేశ్‌ను మెచ్చుకుంటూ ట్వీట్లు చేస్తున్నారు. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో ఆయన చూపిస్తున్న విధేయత, దైవభక్తి పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.





