ఆఫ్గన్ నుంచి భారత్ చేరుకున్న 142 మంది దౌత్యాధికారులు… మన పౌరులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు హోంశాఖ ప్రయత్నాలు.. ఎమర్జెన్సీ వీసాలు జారీ

ఆఫ్గనిస్థాన్ ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయాన్ని మూసివేసింది. అక్కడున్న మన అధికారులను స్వదేశానికి తీసుకొచ్చింది. 142 మంది భారత అధికారులున్న వాయుసేన యుద్ధ విమానం కాబూల్ విమానాశ్రయం నుంచి గుజరాత్ లోని జామ్ నగర్ చేరుకుంది..
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సీ-17 విమానంలో అఫ్ఘానిస్థాన్‌లోని భారత రాయబారి రుద్రేంద్ర టాండన్ మంగళవారం స్వదేశానికి చేరుకున్నారు. ఆయనతో పాటు ఎంబసీ సిబ్బంది, ఐటీబీపీ జవాన్లు మొత్తం 142 మందితో సీ-17 విమానం గుజరాత్‌లోని జామ్‌నగర్ ఎయిర్‌బేస్ చేరుకుంది. కాగా, కాబూల్ విమానాశ్రయంలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా వీరిని సోమవారం సాయంత్రమే సురక్షిత ప్రాంతానికి తరలించారు. తాజాగా వారందరిని సీ-17 విమానంలో భారత్ కు తీసుకువచ్చారు. ఇక తాలిబన్లు తిరిగి అఫ్ఘానిస్థాన్‌లో పాగా వేయడంతో ఆ దేశంలోని ప్రజలు విదేశాలకు పారిపోతున్నారు. తాలిబన్ల పాలనలో తాము బతికిబట్టకట్టలేమని వాపోతున్నారు.
ఆఫ్గాన్..తాలిబన్ల కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయిన నేపథ్యంలో కొత్త కేటగిరీ వీసాలను ప్రకటించింది కేంద్ర హోంశాఖ. భారత్‌కు రావాలనుకునే అఫ్గానీల దరఖాస్తులను వేగంగా పరిశీలించేందుకు ఎలక్ట్రానిక్ వీసా విధానాన్ని తీసుకొచ్చింది. ‘ఇ-ఎమర్జెన్సీ ఎక్స్ – మిస్క్ వీసా’ పేరుతో దీన్ని ప్రకటించింది. అఫ్గాన్ లో ఆందోళనకర పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.





