News

గుజరాత్ : 108 దేవాలయాల్లో లౌడ్ స్పీకర్లలో రోజుకు రెండు సార్లు హనుమాన్ చాలీసా

444views

గుజరాత్ లోని వడోదర నగరంలో ఇకపై 108 దేవాలయాల్లో లౌడ్ స్పీకర్ల ద్వారా రోజుకు రెండు సార్లు ‘హనుమాన్ చాలీసా’ వినిపించనున్నారు. గుజరాత్‌లోని మూడవ అతి పెద్ద నగరమైన వడోదరలోని 108 దేవాలయాలు హనుమాన్ చాలీసాను లౌడ్ స్పీకర్ల ద్వారా వినిపించనున్నాయి. దేశ్ గుజరాత్ నివేదిక ప్రకారం ఈ కార్యక్రమం స్థానిక సంస్థ ‘మిషన్ రామ్ సేతు’ మొదలుపెట్టింది.

శ్రావణ మాసం మొదటి సోమవారం నగరంలోని కలఘోడ ప్రాంతంలోని పంచముఖి హనుమాన్ ఆలయంలో లౌడ్ స్పీకర్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆఫీసు బేరర్‌లతో పాటు కొంతమంది భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు కూడా పాల్గొన్నారు. నగర అధ్యక్షుడు డాక్టర్ విజయ్ షా, నగర ప్రధాన కార్యదర్శి సునీల్, జస్వంత్ సోలంకి తదితరులు పాల్గొన్నారు.

లౌడ్ స్పీకర్ పంపిణీ కార్యక్రమం గురించి రామ్ సేతు మిషన్ ప్రెసిడెంట్ దీప్ అగర్వాల్ మాట్లాడారు. ఇళ్లల్లో ఉంటున్న భక్తులకు హనుమాన్ చాలీసా, హారతి కార్యక్రమాలను, ఇతర భక్తి పాటలను లౌడ్ స్పీకర్ల ద్వారా వినిపించాలన్నదే తమ ఉద్దేశమని అన్నారు. కరోనా కారణంగా ఉన్న ఆంక్షల కారణంగా దేవాలయాలను సందర్శించడానికి పెద్ద ఎత్తున భక్తులు రాలేకపోతున్నారు. అలా ఇళ్లల్లో ఉంటున్న వాళ్లకు కాస్త స్వాంతన అందించడానికి తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అగర్వాల్ వివరించారు. లౌడ్ స్పీకర్‌ని పొందడానికి 78 దేవాలయాలు ఇప్పటికే ముందుకు వచ్చాయని అన్నారు. చిన్న దేవాలయాలకు ఒక లౌడ్ స్పీకర్‌ని ఇస్తున్నామని.. పెద్ద దేవాలయాలు రెండు లౌడ్ స్పీకర్లను పొందుతాయని ఆయన అన్నారు. ఈ వార్తలను విశ్వ హిందూ పరిషత్ తన ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో పంచుకుంది. ఈ సంస్థ గత సంవత్సరం శ్రావణ మాసంలో కూడా కొన్ని దేవాలయాలకు లౌడ్ స్పీకర్లను అందించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.