
పాకిస్థాన్‌లోని అఫ్గానిస్థాన్ రాయబారి కుమార్తె కిడ్నాప్ వార్త సంచలనం రేపింది. పాకిస్థాన్‌లో విధులు నిర్వహిస్తున్న అఫ్గాన్ రాయబారి నజీబుల్లా అలిఖిస్ కుమార్తె సిల్‌సిలా అలిఖిల్(26)ను ఇస్లామాబాద్‌లో కొందరు దుండగులు అపహరించినట్లు అఫ్గానిస్థాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఆమెను చిత్రహింసలు పెట్టి అనంతరం విడిచిపెట్టినట్లు అఫ్గాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. సూపర్‌మార్కెట్‌కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న సిల్‌సిలాను అపహరించి చిత్రహింసలు పెట్టారని, అనంతరం విడిచిపెట్టారని వెల్లడించింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. ఈ దుశ్చర్యను ఆఫ్గానిస్థాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై తక్షణ చర్యలు చేపట్టాలని, పాకిస్థాన్‌లో ఉన్న అఫ్గాన్ పౌరులకు తగిన భద్రత కల్పించాలని పాక్ ప్రభుత్వాన్ని కోరింది. అయితే కిడ్నాప్ ఘటనపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ గానీ, ఇస్లామాబాద్ పోలీసులు గానీ ఇప్పటివరకు స్పందించలేదని సమాచారం.





