
కరోనా కారణంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం పవిత్ర కన్వర్ యాత్రను రద్దు చేయగా.. తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా థర్డ్ వేవ్ ఆందోళనలతో కన్వర్ యాత్రను రద్దు చేస్తున్నట్లు శనివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. ఉత్తరాదిన ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న కన్వర్ యాత్రను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించుకోవడానికి మొదట అనుమతిచ్చిన యూపీ ప్రభుత్వం… తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ ఉత్తర్వులు జారీ చేసింది. యాత్రపై నిర్ణయం తీసుకోకపోతే తామే నిర్ణయం తీసుకుంటామని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. మతపరమైన విశ్వాసాల కంటే ప్రజల ప్రాణ రక్షణే ముఖ్యమని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
దీనిపై విశ్వ హిందూ పరిషత్ స్పందిస్తూ.. ఈ నిర్ణయాన్ని ఆమోదించబోమని స్పష్టంచేసింది. కరోనా పట్ల సున్నితంగా ఆలోచిస్తున్న ప్రజలు, రాజకీయ పార్టీల ర్యాలీలు, రైతుల నిరసనలను పరిగణనలోకి తీసుకోని వారు.. దీనిపై నిర్ణయం ఎలా తీసుకుంటారని వీహెచ్పీ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ వ్యాఖ్యానించారు. యూపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉందని ప్రకటించారు. ఉత్తరాదిన శ్రావణ మాసంలో నిర్వహించే కన్వర్ యాత్రలో భాగంగా శివ భక్తులు గంగా నది నీటిని కావడిలో తీసుకొని వెళ్లి మహాశివుడికి జలాభిషేకం చేస్తారు.





