పశ్చిమ బెంగాల్ లో ఉన్నది ‘పాలకుల న్యాయమే ‘’ “న్యాయమైన పాలన” కాదు – NHRC కమిటీ నివేదిక వెల్లడి సిబిఐ దర్యాప్తుకు సిఫార్సు

పశ్చిమ బెంగాల్‌లో ‘రూల్ ఆఫ్ లా’ (న్యాయమైన పాలన) బదులు ‘రూలర్ ఆఫ్ లా’ (పాలకుల న్యాయమే) ఉందని, రాష్ట్రంలో పోల్ అనంతర హింస కేసుల్లో తాము సిబిఐ దర్యాప్తును సిఫారసు చేస్తున్నామని కలకత్తా హైకోర్టు నియమించిన NHRC కమిటీ తన నివేదికలో వెల్లడించింది . NHRC కమిటీ జూలై 12 న తుది నివేదికను సమర్పించింది.
నివేదిక పేర్కొంది “పైన వివరించిన ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, బాధితులకు న్యాయం అందించాల్సిన అవసరం ఉంది. రక్షణ మరియు న్యాయ వ్యవస్థపై వారి విశ్వాసాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. దీనిని తటస్థ సంస్థ మాత్రమే ఉత్తమంగా అందించగలదు. అందువల్ల, హత్య, అసహజ మరణాలు, అత్యాచారం మరియు తీవ్రమైన గాయాలు వంటి ఆరోపణలతో కూడిన ఫిర్యాదులతో సహా అన్ని ఘోరమైన కేసులను దర్యాప్తు కోసం సిబిఐకి బదిలీ చేయాలని సిఫార్సు చేస్తున్నాం . ” అని NHRC తన నివేదికలో వెల్లడించింది
“సిబిఐ దర్యాప్తు చేసే అన్ని కేసుల విచారణ రాష్ట్రానికి వెలుపల జరగాలి” అని కూడా NHRC పేర్కొంది.
రాష్ట్రంలో పోల్ అనంతర హింసకు సంబంధించిన కొన్ని కేసులను పరిశీలించడానికి కోర్టు పర్యవేక్షణలో నడిచే SIT దర్యాప్తును కూడా NHRC సిఫారసు చేసింది.
“బాధితులను హింసించేందుకు, గాయపరిచేందుకు అధికార పార్టీ గూండాలతో కలిసి పోలీసులు కూడా బాధితులపై దాడులకు సహకరించారని నివేదిక పేర్కొంది. “బాధితులను పోలీసులు తప్పుడు కేసులలో ఇరికించారు, పోలీసులు బాధితులపై నిందితులచేతనే కౌంటర్ కేసులు నమోదు చేయించారు. అలాంటి కౌంటర్ కేసులలో పోలీసులు ముందస్తు తేదీలను పేర్కొన్నారు. (నిజమైన బాధితులకు వ్యతిరేకంగా నిందితులకు విశ్వసనీయతను పెంచడానికి, వారి వాదనకు బలం చేకూర్చడానికి), అలాగే బాధితులు మొదట పెట్టిన కేసులలో సాధారణమైన సెక్షన్లు పెట్టిన పోలీసులు నిందితులచే బాధితులపై మోపబడిన కౌంటర్ కేసులలో మాత్రం చట్టంలోని తీవ్రమైన సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. పోలీసులు కౌంటర్ కేసులు మోపబడిన బాధితులను అరెస్టు చేశారు. కానీ అదే బాధితులు పెట్టిన కేసులపైన మాత్రం ఎలాంటి చర్యలనూ తీసుకోలేదు. నేరుగా తమ సమక్షంలోనే దాడులు జరుగుతూ ఉన్నా, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. నిందితులతో రాజీ చేసుకోవలసిందిగా పోలీసులు బాధితులకు సలహా ఇవ్వడానికి కూడా ప్రయత్నించారు. హత్య కేసు కూడా అసహజ మరణ కేసుగా నమోదు చేయబడింది. ” అని NHRC తన నివేదికలో పేర్కొంది.
అధికార పార్టీ మద్దతుదారులే హింసకు పాల్పడ్డట్టుగా NHRC కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఇది ” ఇదే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హింసాత్మక సంఘటనల యొక్క పూర్తి చిత్రం. హింసను నిరోధించడానికి లేదా నియంత్రించడానికి లేదా సరిదిద్దడానికి రాష్ట్ర యంత్రాంగం అతి తక్కువగా ప్రయత్నించింది. కానీ గడచిన ఎన్నికలలో తమ ప్రత్యర్థి పార్టీ తరపున పనిచేసిన వ్యక్తులపై అధికార పార్టీ మద్దతుదారులు ప్రతీకారం తీర్చుకునేందుకు చేసిన హింస మాత్రం చాలా వ్యవస్థీకృతమైనది, విస్తృతమైనది. ఈ మొత్తం ఘటనలలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మాత్రం మౌన ప్రేక్షకులుగా మిగిలిపోగా, మరికొందరు మాత్రం అధికార పార్టీ గూండాలకి స్పష్టంగా దీనికి సహకరించారు. ” అని నివేదిక పేర్కొంది.





