పోలీసు బలగాల మోహరింపును ఉపయోగించి కోయంబత్తూరు నగరపాలక సంస్థ మంగళవారం (జూలై 13) కుమారసామి నగర్‌లోని ఏడు దేవాలయాలను కూల్చివేసింది.
కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ రవిచంద్రన్, అమ్మన్ కోవిల్, బన్నారి అమ్మన్ కోవిల్, అంగల పరమేశ్వరి, కరుప్పారాయణ్ కోవిల్, మునీశ్వరన్ కోవిల్ మరియు మరికొన్ని దేవాలయాలను పడగొట్టడానికి JCB యంత్రాలను ఉపయోగించారు.
కూల్చివేసిన దేవాలయాలను చెరువుకు ఉత్తర భాగంలో ఆక్రమించిన భూమిలో నిర్మించినట్లు కార్పొరేషన్ పేర్కొంది.
దేవాలయాల కూల్చివేతపై అనేకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ జర్నలిస్ట్ మరియు రాజకీయ వ్యాఖ్యాత రతన్ శారదా ట్విట్టర్లో ఇలా వ్రాశారు, “దేవాలయాలన్నీ ఆక్రమించిన భూమిలో కట్టినవే. మొఘలుల అభిప్రాయం కూడా ఇదే. ఇప్పుడు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.”
దేవాలయాల కూల్చివేతను విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండించింది. బుధవారం నాడు (జూలై 14) కోయంబత్తూరులోని గాంధీ పార్కులో నిరసన వ్యక్తం చేసింది.
దేవాలయాలను కూల్చివేయడంపై హిందూ మున్నని కూడా నిరసన వ్యక్తం చేసింది. హిందూ మున్నని నూతన దేవాలయాలను నిర్మించి అక్కడ విగ్రహాలను ప్రతిష్టించడానికి వీలుగా ప్రత్యామ్నాయ భూమిని డిమాండ్ చేసింది.
హిందూ మున్నని కార్యకర్త సి ధనపాల్, టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ దేవాలయాలను మార్చడానికి ప్రత్యామ్నాయ భూములను సమకూర్చే విషయమై చర్చిస్తున్నామని, అయితే కార్పొరేషన్ ఇంతలోనే అకస్మాత్తుగా జూలై 13, మంగళవారం నాడు ఆలయాలను కూల్చివేసిందని తెలిపారు.





