
భారత నావికా దళానికి మరో యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ యుద్ధవిమానం అందింది. బోయింగ్ సంస్థ తయారు చేసిన పీ-8ఐ విమానం మంగళవారం నావికాదళానికి చేరింది. ఈ రకం విమానాలు ఎనిమిదింటిని కొనుగోలు చేసేందుకు భారత్ 2009లో ఒప్పందంపై సంతకం చేసింది. ఆ తర్వాత 2016లో మరో నాలుగు కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకొంది. ఆ కాంట్రాక్టులో రెండో విమానం నేడు వచ్చింది. దీంతో భారత నావికా దళం వద్దకు 10వ పీ-8ఐ వచ్చినట్లైందని రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దీనిని సబ్‌మెరైన్ల వేటకు, సహాయ కార్యక్రమాలకు వినియోగిస్తామని పేర్కొంది. గతేడాది నవంబర్‌లో భారత నావికాదళం ఈ తరహాకు చెందిన ఒక విమానం అందుకొంది. భారత నావికా దళంలోని ఈ విమానాలు 2013 నుంచి ఇప్పటి వరకు దాదాపు 30,000 గంటల పెట్రోలింగ్ నిర్వహించాయి. బోయింగ్ సంస్థ భారత సిబ్బందికి ఈ విమానం వినియోగం, వ్యూహాలపై శిక్షణ ఇస్తోంది.
ఒక్కసారిగా సబ్‌మెరైన్ల సంఖ్యను పెంచుకోవడం భారత్‌కు ఆర్థికంగా సాధ్యంకాదు. దీంతో పోల్చితే సబ్‌మెరైన్లను వేటాడే టెక్నాలజీ చౌక. అందుకే భారత్ ఈ దిశగా ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఈ వ్యూహంలో భాగంగానే సముద్ర గస్తీని పటిష్ఠం చేసే పీ-8ఐ మారిటైమ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను భారత్ కొనుగోలు చేసింది. సముద్ర జలాల్లో నక్కిన సబ్‌మెరైన్లను పసిగట్టడంలో ప్రపంచంలోనే ఇవి అత్యుత్తమమైనవి. హిందూ మహాసముద్రంలో చైనాను కట్టడి చేయడానికి అమెరికా వ్యూహాత్మకంగా వీటిని భారత్‌కు సమకూరుస్తోంది. దీంతోపాటు ‘ఎంహెచ్-60 రోమియో సీహాక్’ హెలికాప్టర్లను యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్‌గా, యాంటీ సర్ఫేస్ వెపన్స్ సిస్టంగా వాడేందుకు అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేసింది.





