
నిజానికి కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో కేరళలోనే మొట్టమొదట కొన్ని కేసులు కనిపించాయి. అనంతరం ఉదృతి పెరిగింది. ఆ తర్వాత కోవిడ్ అదుపులోకి వచ్చిందని కేరళ ప్రభుత్వం ప్రకటించినా, కేవలం పరువు కాపాడుకోడానికే కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం వాస్తవాలను వెల్లడించడం లేదని, అక్కడ వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయనే వార్తలు వచ్చాయి. కానీ ఒక వర్గం మీడియా మాత్రం కోవిడ్ కట్టడిలో కేరళను రోల్ మోడల్ గా దేశం ముందు నిలిపే ప్రయత్నం చేసింది. సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతున్న సమయంలో కూడా కేరళ కేసుల సంఖ్యలో ఒక దశలో మహారాష్ట్ర తర్వాత రెండవ స్థానంలో నిలచింది. కానీ లెఫ్టిస్ట్ అనుకూల మీడియా ఆ అంశానికి అంతగా ప్రాధాన్యతనివ్వలేదు. ఇప్పుడు మళ్ళీ కేరళలో కోవిడ్ కేసులు విజృంభిస్తున్నాయి.
ప్రస్తుతం కేరళలో ఓవైపు కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో పాటు జికా వైరస్ కూడా కలకలం రేపుతోంది. రోజుకు 12-15 వేల మధ్య కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఇంతవరకు మొత్తం 30.39 లక్షల కేసులు నమోదైన రాష్ట్రంలో క్రియాశీలక కేసుల సంఖ్య 1,13,115కి చేరింది. పలు కొవిడ్ నిబంధనలను సడలించడం (అన్‌లాక్) వల్లే కేసులు పెరుగుతున్నాయని.. క్రమేపీ తగ్గుముఖం పడతాయని ఆశిస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ చెబుతున్నారు. కేరళలో కొవిడ్ కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. ఈ ఏడాది జూన్ 1న 19,760 రోజువారీ కేసులు నమోదు కాగా వారం రోజుల్లో ఆ సంఖ్య 9,313కి తగ్గింది. మళ్లీ రెండు రోజులకే 16,204కి పెరిగింది. నెల రోజుల తర్వాత కూడా (జులై 11న) 14 వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. అయితే కేసుల సంఖ్య వైద్య వసతులపై ఒత్తిడి పెంచేస్థాయిలో లేకపోవడం వల్ల మహమ్మారిపై పోరాడగలుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
అయితే ఇలా ఎక్కువ కాలం కొనసాగితే అది వైద్యులపైన, ఆరోగ్య సంరక్షణ సిబ్బందిపైనా మరింత ఒత్తిడి పెంచుతుందని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సినేషన్ అత్యంత కీలకమని, టీకాల సేకరణకు ప్రభుత్వం మరింత కృషి చేయాలని సూచిస్తున్నారు. ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఎక్కడా గుమిగూడకుండా చూడాలని నొక్కి చెబుతున్నారు. వీధుల్లోకి వస్తే మాస్కులు తప్పక ధరించాలని స్పష్టం చేస్తున్నారు. కేసులు తగ్గకపోవడానికి ప్రజలు కొవిడ్ జాగ్రత్తలు పాటించకపోవడం ఒక కారణమని వైరాలజిస్టులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో 14 జికా వైరస్ కేసులు బయటపడటం మరింత ఆందోళనకరంగా మారింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకు కేంద్రం ప్రత్యేక బృందాన్ని కూడా పంపించింది.





