News

గుంటూరు జిల్లా జవాను వీరమరణం – రూ.50 లక్షల సాయం ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్

557views

మ్ముకశ్మీర్‌ రాజోరి జిల్లాలోని సుందర్బని సెక్టార్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన యువ సైనికుడు మనుప్రోలు జశ్వంత్ ‌రెడ్డి(23) వీరమరణం పొందారు. ఈ మేరకు పట్టణంలోని దరివాద కొత్తపాలెంలోని తల్లిదండ్రులకు శుక్రవారం తెల్లవారుజామున ఆర్మీ అధికారులు సమాచారం అందించారు. జశ్వంత్‌ 2016లో మద్రాసు రెజిమెంట్‌లో సైన్యంలో చేరారు.తొలుత నీలగిరిలో పనిచేసిన ఈయన ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. నాలుగు నెలల క్రితం సెలవులకు ఇంటికి వచ్చి వెళ్లారు.మరో నెలరోజుల్లో అతనికి వివాహం చేసేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో ఉగ్రవాదుల కాల్పుల్లో కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు వెంకటేశ్వరమ్మ శ్రీనివాసరెడ్డి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహం శుక్రవారం రాత్రికి బాపట్ల చేరుకోవచ్చని అధికారుల నుంచి సమాచారం అందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుపెట్టగా.. ముష్కరుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే.

రూ.50 లక్షల సాయం ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్ :

గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన యువ సైనికుడు జశ్వంత్‌రెడ్డి(23) వీరమరణం పొందడంపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. జశ్వంత్‌రెడ్డి త్యాగం మరువలేనిదని అన్నారు. కడప జిల్లా పర్యటనలో ఉన్న జగన్‌ అక్కడి నుంచే ప్రభుత్వ సాయాన్ని ప్రకటించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.