
కరోనా చికిత్సలో వినియోగించే 2-డీజీ ఔషధం ఉత్పత్తికి మరో కంపెనీకి అనుమతి లభించింది. ఈ ఔషధం తయారీ, మార్కెటింగ్ కోసం డీఆర్‌డీవో నుంచి తమకు అనుమతి లభించినట్టు మ్యాన్‌కైండ్ ఫార్మా వెల్లడించింది. గ్వాలియర్‌లోని డిఫెన్స్ రీసెర్చి అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (డీఆర్‌డీఈ) ఈ ఔషధాన్ని తయారు చేయగా.. డీఆర్‌డీవోకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ (INMAS) ల్యాబోరేటరీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీలలో క్లినికల్ ట్రయల్స్ జరిగాయని మ్యాన్‌కైండ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ డ్రగ్‌ను విశాఖపట్నం, హిమాచల్‌ప్రదేశ్‌లలోని తమ యూనిట్లలో ఉత్పత్తి చేయనున్నట్టు ప్రకటించింది. మధ్యస్థ నుంచి తీవ్రమైన లక్షణాలు ఉన్న రోగులకు ఈ ఔషధం అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతించినట్టు మ్యాన్‌కైండ్ ఫార్మా తెలిపింది. ఆస్పత్రిపాలైన కరోనా రోగులు త్వరగా కోలుకొనేందుకు దోహదం చేయడంతో పాటు ఆక్సిజన్‌పై ఆధారపడే అవసరాన్ని తగ్గిస్తుందని తేలినట్టు ప్రకటనలో పేర్కొంది. దేశంలో కరోనా బారినపడిన రోగులకు విస్తృతంగా ఈ ఔషధాన్ని చేరవేయాలన్న లక్ష్యంతోనే ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపింది.
2-డీజీ ఔషధానికి మనదేశంలో భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అత్యవసర అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే డీఆర్‌డీఓ భాగస్వామ్యంతో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ఈ ఔషధాన్ని వినియోగంలోకి తీసుకువచ్చింది. ఈ మందు లభ్యత ఇంకా పరిమితంగానే ఉండటంతో దాన్ని పెంచేందుకు ఇతర కంపెనీలను సైతం ప్రోత్సహించాలని డీఆర్‌డీఓ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల శిల్పా మెడికేర్‌కు ఉత్పత్తి చేసేందుకు అనుమతించిన డీఆర్‌డీవో.. తాజాగా మ్యాన్‌కైండ్ ఫార్మాకు కూడా అనుమతి మంజూరు చేయడం విశేషం.





