
జమ్ములోని వైమానిక స్థావరం పై ఇటీవల జరిగిన డ్రోన్ల దాడిలో వాడిన పేలుడు పదార్థాల మిశ్రమాల్లో ఆర్డీఎక్స్(Rdx), నైట్రేట్ ఉన్నట్లు ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాలల్లో గుర్తించారు. భారత్‌లో ఆర్డీఎక్స్ ఎక్కడా లభించదు. దీనిని పాకిస్థాన్ నుంచి తెప్పించాల్సిందే. ఫలితంగా పేలుళ్లలో ఉపయోగించిన ఈ ఒక్క పదార్థమే.. పాక్ పాత్రను తెలియజేస్తోదని అధికారులు పేర్కొన్నారు.
ఈ దాడికి చైనాలో తయారైన జీపీఎస్ డ్రోన్ వాడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దాడికి వాడిన రెండు బాంబుల్లో ఒకటి పెద్దదిగా ఉంది. దీనిని వైమానిక స్థావరాల్లో కట్టడాలను ధ్వంసం చేయడానికి సిద్ధం చేసినట్లు భావిస్తున్నారు. రెండో బాంబు.. మనుషులను లక్ష్యంగా చేసుకొని తయారు చేసినట్లు చెబుతున్నారు. ఎందుకంటే తొలి పేలుడు తర్వాత అక్కడకు చేరుకున్న వారు మరణించాలనే లక్ష్యంతో దానిలో ఎక్కువగా బాల్‌బేరింగ్ గుండ్లు, మేకులు వంటివి ఉంచారు. ఈ ఆధారాలన్నీ లష్కరే తోయిబా పాత్రను తెలియజేస్తున్నాయి. పాక్ సైన్యంలో అప్రకటిత భాగంగా లష్కరే తోయిబాకు పేరుండగా ఆ దేశం సైన్యం ఈ స్థాయి పేలుడు పదార్థాలు, ఆయుధాలను దానికి సమకూరుస్తోంది.





