News

భారత్ కు క్షిపణి రక్షణ వ్యవస్థ… నర్మగర్భంగా వెల్లడించిన ఇజ్రాయిల్

892views

దక్షిణాసియాకు చెందిన ఒక దేశానికి తమ ఈఎల్‌ఐ–4030 డ్రోన్‌ గార్డ్‌ వ్యవస్థను(సీ–యూఏఎస్‌)ను విక్రయించినట్లు ఇజ్రాయెల్‌ ఏరోస్పేస్‌ ఇండస్ట్రీస్‌(ఐఏఐ) చేసిన ప్రకటన సంచలనం కలిగిస్తోంది. సదరు దేశం పేరును సంస్థ వెల్లడించకున్నా, అది భారతేనని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. ఇటీవల భారత ఎయిర్ ‌ఫోర్స్‌ స్టేషన్ల వద్ద డ్రోన్లు కలకలం సృష్టించిన నేపథ్యంలో ఇజ్రాయెల్‌ సంస్థ ప్రకటన ప్రాముఖ్యం సంతరించుకుంది. కొన్ని కోట్ల డాలర్లకు డ్రోన్‌ గార్డ్‌ విక్రయాన్ని పూర్తి చేశామని మాత్రమే ఈనెల 2న ఐఏఐ ప్రకటించినట్లు డిఫెన్స్‌ వార్తల ప్లాట్‌ఫామ్‌ జానెస్‌ తెలిపింది.

ఎప్పటికల్లా సదరు దేశానికి ఈ వ్యవస్థను డెలివరీ చేసేదీ వెల్లడించలేదు. తమ డోమ్‌ వ్యవస్థపై భారత్‌ ఆసక్తి చూపుతోందని గతేడాది ఇజ్రాయెల్ ‌కు చెందిన ఒక ఉన్నతాధికారి ప్రకటించిన సంగతి తెలిసిందే! దీన్ని దృష్టిలో ఉంచుకొనే, తాజాగా ఐఏఐ చేసిన ప్రకటనలోని దేశం ఇండియా అని పలువురు అంచనా వేస్తున్నారు. భారత్‌ వద్ద ప్రస్తుతం ఎలాంటి యాంటీ డ్రోన్‌ వ్యవస్థ లేదని రక్షణ నిపుణుడు అభిజిత్‌ అయ్యర్‌ అభిప్రాయపడ్డారు. జమ్మూ ఘటనల నేపథ్యంలో ఈ డోమ్‌ వ్యవస్థకు ప్రాధాన్యం పెరగడం, భారత్‌కు ఇజ్రాయెల్‌ నమ్మకమైన రక్షణ భాగస్వామి కావడం వల్ల సీ–యూఏఎస్‌ను భారత్‌ కొనుగోలు చేసేందుకు అభ్యంతరాలు ఉండవని భావిస్తున్నట్లు చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.